Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేములకు ఎస్జీటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్జీటీయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని శనివారం హైదరాబాద్‌లో ఆ సంఘం ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షులు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఒక ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయాలనీ, తరగతి గదికొక టీచర్, పాఠశాలకో హెచ్ఎం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాఠశాలల్లో నిరసనలు, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడతామని తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన రాకపోతే పాఠశాల విద్యాశాఖ సంచాలకుల (డీఎస్ఈ) కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ అంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో పరిశుభ్రతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అపరిశుభ్ర వాతావరణంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. సర్కారు బడుల్లో సర్వీసు పర్సన్లను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కోరారు.