Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులను రోడ్డుపాలు చేయడమే
- మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలి
- కార్మికులు సమరశీల పోరాటాల్లోకి రావాలి: తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ మహాసభలో పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను ప్రయివేటు ఏజెన్సీలకు ఇవ్వటం మానేయాలన్నారు. ఆ వ్యవస్థను ప్రయివేటు పరం చేయడమంటే పేద పిల్లల నోటికాడి ముద్దను లాక్కోవడమేననీ, కార్మికులను రోడ్డు పాలు చేయడమేనని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని రక్షించుకునేందుకు కార్మికులంతా సమరశీల పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మధ్యాహ్న పథకం కార్మికుల యూనియన్ మూడో రాష్ట్ర మహాసభ జరిగింది. ఆ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వచ్చాక పిల్లలకు ఓ పూట భోజనం అందుతున్నదనీ, వారికి కొంతమేర పౌష్టికాహారం లభిస్తున్నదని తెలిపారు. ఆ పథకంతో డ్రాపౌట్స్ తగ్గడంతో పాటు పిల్లలు శ్రద్ధగా క్లాసులు వింటున్నారని చెప్పారు. కానీ, కేంద్ర, ప్రభుత్వాలు ఆ పథకానికి ఇచ్చే నిధులను ఏటా తగ్గిస్తున్నాయని విమర్శించారు. దీని ఫలితంగా ఆ పథకాన్ని నిర్వహిస్తున్న కార్మికులు అప్పులు చేసి, పుస్తెలతాళ్లు అమ్ముకుని పిల్లలకు బువ్వ పెడుతున్నారని తెలిపారు. నెలకు వెయ్యరూపాయల గౌరవవేతనం ఇస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఆ పథకానికి బడ్జెట్లో నిధులు పెంచాలనీ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్టాలలో ఇస్తున్నట్టుగానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు, విద్యార్ధుల జీవించే హక్కును హరిస్తున్నదని విమర్శంచారు. కార్మిక చట్టాలను కాలరాసి నాలుగు కోడ్లను తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ.. తమ యూనియన్ జాతీయ మహాసభలను నవంబర్ 4,5 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. వాటి జయప్రదానికి సహకరించాలని కోరారు. రోజుకు రూ.2 ఇచ్చి వారంలో మూడు కోడిగుడ్లు పెట్టాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు పౌరసరఫరాల శాఖ ద్వారా సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు. వెయ్యి రూపాయల గౌరవ వేతనంతో కుటుంబాలు ఎలా బతకాలనే విషయాన్ని పాలకులే చెప్పాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం రూ.3 వేలు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి నేటికీ జీవో ఇవ్వకపోవడం దారుణమన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలనీ, వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చక్రపాణి, ఉన్ని కృష్ణ, పద్మ, కవిత, నర్సమ్మ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.