Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సమస్యకు త్వరలోనే పరిష్కారం
- జీ.ఓ నెం.3ని న్యాయపరంగా అమలుకు కృషి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- జోడేఘాట్‌లో మన్యం వీరుడికి ఘన నివాళులు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, కెరమెరి
ఆదివాసీల ఆరాధ్య దైవం, జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన వీరుడు కుమురంభీం గిరిజనుల గుండెల్లో సదాస్మరణీయుడని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పోడు భూముల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో సమన్వయ కమిటీలు వేసిందని, ప్రస్తుతం సర్వే కూడా జరుగుతోందని కోర్టు తదుపరి ఉత్తర్వులను అనుసరించి అర్హులైన గిరిజనులకు హక్కుపత్రాలు అందజేస్తామని తెలిపారు. జీఓ నెం.3ని న్యాయపరంగా అమలు చేసేందుకు సుప్రీంకోర్టులో కేసువేసి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం కుమురంభీం 82వ వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు. కుమురంభీం సమాధి వద్ద ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిజాం పాలనలో రైతుల సంక్షేమం కోసం వీరోచిత పోరాటం చేసిన కుమురంభీం సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చి భీం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. కుమురంభీం పోరాట ప్రదేశం జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేశామని తెలిపారు. రూ.25కోట్లతో భీం స్మారక చిహ్నం, స్మృతివనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, భీం పోరాట పటిమను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా అన్ని సౌకర్యాలను కల్పించామని వివరించారు. వీటితో పాటు హట్టి నుంచి జోడేఘాట్ వరకు 15కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. రెండు పడక గదుల పథకం, ఆశ్రమ పాఠశాలల నిర్మాణం తదితర సౌకర్యాలనూ కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై కొమురంభీం విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తెలిపేలా రూ.55 కోట్లతో ఆదివాసీ భవనాన్ని నిర్మించి ప్రారంభించినట్టు చెప్పారు. గిరిజనులకు విద్య, ఉపాధి అవకాశాల్లో 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. జిల్లాలోని వట్టి వాగు, చెలిమెల వాగు ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు రెండవ దశలో మరికొన్ని చెక్ డ్యాముల నిర్మాణానికి త్వరలోనే అనుమతులు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దండారీ ఉత్సవాల కోసం రూ.కోటి మంజూరు చేశామన్నారు. స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు ఆదివాసీల గూడాలలో నూతనంగా 100 దేవాలయాల నిర్మాణాలకు గాను ఒక్కొక్క ఆలయానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ అనుమతినిచ్చిందని తెలిపారు. గిరిజన తెగల మధ్య ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వర్ధంతి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో కుమురంభీం జిల్లా పరిషత్ అధ్యక్షులు కోవాలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు రాహుల్‌రాజ్, సిక్తాపట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయి, ఎస్పీ సురేష్ కుమార్, మాజీఎంపీ గోడం నగేష్, పద్మక్ష కనకరాజు, భీం మనువడు సోనేరావు తదితరులు పాల్గొన్నారు.