Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఏటేటా దళితులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయనీ, 75ఏండ్ల స్వతంత్య్ర భారతంలోనూ వీరిపై అంటరాని తనం, లైంగిక దాడులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని దళిత మానవ హక్కుల జాతీయ నాయకులు మార్టిన్ మక్వాన్ తెలిపారు.పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న చట్టాలతోనే సంబంధిత బాధ్యులను శిక్షించవచ్చని ఆయన తెలిపారు. తద్వారా దళితులపై దాడులను అరికట్టొచ్చని వివరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్), దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన 'అంటరాని తనం, లైంగిక దాడుల నిర్మూలన ఎండమావేనా?' అనే అంశంపై ప్రొఫెసర్ వి కృష్ణ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. కార్యక్రమంలో సీడీఎస్ చైర్పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్య, డీబీఎఫ్ జాతీయ అధ్యక్షులు కొరివి వినరుకుమార్, ప్రొఫెసర్ చెన్నబసవయ్య, డాక్టర్ కనకరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్టిన్ మక్వాన్ మాట్లాడుతూ 1947నుంచి 1977వరకు దళితులపై జరిగిన లైంగిక దాడులు, కేసులకు సంబంధించిన అధికారిక లెక్కలు సర్కారు వద్ద లేవన్నారు. వారిపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం దగ్గర నిర్మాణాత్మకమైన విధానం ఉందా? అని ప్రశ్నించారు. గుజరాత్ రాష్ట్రంలో దళిత వాడల్లో 'కైన్ యాత్ర' ద్వారా సుమారు రూ.20లక్షలను సేకరించి నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి విరాళమివ్వటాన్ని అడ్డుకున్నారని తెలిపారు. ఇలాంటి చర్యల ద్వారా దళితులను స్వాతంత్య్ర భారతంలో భాగం ఎలా చేయగలరంటూ ప్రశ్నించారు. దళిత ఉపకులాల్లో సైతం అస్పృశ్యత కనిపించటం విచారించదగ్గ విషయమన్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం దేశంలో 26వేల మంది దళితులు అగ్రకుల పెత్తందార్ల చేతుల్లో హత్యకు గురయ్యారని తెలిపారు. 54వేల మంది దళితులు, 22వేల మంది గిరిజన మహిళలు లైంగిక దాడికి గురయ్యారని చెప్పారు.12.50 లక్షల మందికి పైగా వివక్షకు గురయ్యారని వివరించారు. ప్రతి ఏడాది వెలువడుతున్న లెక్కలను పరిశీలిస్తే..దాడులు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితులను దళితులు, యువత, మేధావులు అర్థం చేసుకోవాలని కోరారు.