Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని రాజగోపాల్‌రెడ్డి అమ్ముకుండు
- రాజీనామాతో బీజేపీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినవో చెప్పాలి : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్ / హైదరాబాద్
ఎన్నో ఆశలతో మునుగోడు ప్రజలు కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే ఎమ్మెల్యే పదవి కాలం ఉండగానే నోట్ల కట్టల కోసం అమ్ముడు పోయి.. బీజేపీతో కుట్ర చేసి మునుగోడు ఉపఎన్నికలను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెచ్చి పెట్టాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, డి.నాగారం, పీపల్‌పహాడ్,అల్లాపురం, ఎనగంటితండా, జైకేసారం,నేలపట్ల, దామెర, చింతలగూడెం గ్రామాల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని చెప్తున్న రాజగోపాల్‌రెడ్డి మునుగోడుకు బీజేపీ నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీకి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. అమ్ముడుపోయిన వాడికి మూటలు వచ్చినరు కనకే మునుగోడు ఉపఎన్నికలు వచ్చాయని స్పష్టం చేశారు. ప్రజలను ముంచి సంపాదించిన సొమ్ముతో డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సర్కార్ మహిళల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు గౌరవం దక్కిందని గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో నలుగురు మహిళలను కేంద్ర మంత్రులుగా, రాష్ట్రంలో ఐదు మంది మహిళలను మంత్రుల పదవులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం పావలా వడ్డీ రుణాలు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వెళ్తే సహించేది లేదని హెచ్చరించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలను కొనుగోలు చేసి రాజగోపాల్‌రెడ్డి డబ్బు మదంతో గెలవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మహిళలకు పెద్దపీట వేయడానికి మునుగోడు అభ్యర్థి ఎంపిక నిదర్శనమని అన్నారు. నియోజకవర్గంలో 1.12 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. మహిళా అభ్యర్థి అయిన పాల్వాయి స్రవంతికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్, పున్న కైలాస్ నేత, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి, నాయకులు మల్కాపురం నర్సింహ, బోయ రామచంద్రం, ముప్పిడి సైదులు,జక్కా యాదిరెడ్డి, పన్నాల రాజిరెడ్డి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కచ్చితంగా వస్తారు
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కచ్చితంగా వస్తారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆయనతో ఏఐసీసీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు. వాటాల పంపకం విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పంచాయితీ విక్రమార్కుడు సినిమాలో రవితేజ, బ్రహ్మానందం పాత్రలను తలపిస్తున్నదని చెప్పారు. ఆ పార్టీల మధ్య మిత్ర భేదం తప్ప శత్రు భేదమే లేదని అన్నారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులతో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు ఈ సమావేశానికి హజరయ్యారు.