Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూత వైద్యంపై కోర్సును ప్రవేశపెట్టిన ఘనత మీదే
- కార్లు.. బైకులు కాదు... విమానాలిచ్చినా జనం బీజేపీకి ఓట్లెయ్యరు : బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ ఫైర్
- కమ్యూనిస్టు యోధులు గెలిచిన ప్రాంతం మునుగోడు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాంత్రికుడి సూచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్... బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. నిమ్మ కాయలు, నల్ల పిల్లులు, మిరపకాయల గురించి బీజేపీ నేతలకు తెలిసినంతగా దేశంలో మరెవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. బెనారస్ యూనివర్సిటీలో ఏకంగా భూత వైద్యంపై ఆర్నెల్ల కోర్సును ప్రవేశపెట్టిన ఘనత ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన సెటైర్ విసిరారు. ఆదివారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ప్రభుత్వ విప్ ఎమ్.ఎస్.ప్రభాకరరావు, ఎమ్మెల్సీ వి.గంగాధరగౌడ్తో కలిసి మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ ఏర్పాటు గురించి బండి సంజయ్‌తోపాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. నిర్మలా సీతారామన్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని హితవు పలికారు. తాంత్రిక విద్య గురించి మాట్లాడుతున్న సంజయ్... తానే స్వయంగా ఆ విద్యను నేర్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మునుగోడులో బీజేపీ ఒక్కో నేతకు ఒక్కో రేటును నిర్ణయించి... కొనుగోళ్లకు తెరలేపిందని విమర్శించారు. విశ్వసనీయ సమాచారం ఆ పార్టీ... మొత్తం 200 బ్రిజా కార్లు, రెండు వేల బైకులను వివిధ షోరూముల్లో బుక్ చేసిందని అన్నారు. టీఆర్ఎస్ తరపున మునుగోడులోని వివిధ ప్రాంతాల్లో స్క్వాడ్లను ఏర్పాటు చేశామని వివరించారు.
ఆయా కార్లు, బైకుల సమాచారంతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీజేపీ నేతలు మోటారు సైకిళ్లను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో... 'ఇప్పుడు మోటారు సైకిళ్లను ఇస్తారు... తర్వాత వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తారు...' అని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు కావాలా..? మోటార్లకు మీటర్లు కావాలా...? అనే విషయాన్ని మునుగోడు ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. రాజగోపాల్‌రెడ్డి ధనం కావాలా..? మునుగోడు ఆత్మగౌరవం కావాలా..? అని ప్రశ్నించారు. ప్రస్తుత ఉప ఎన్నికను బీజేపీ కేవలం తన స్వార్థ రాజకీయాల కోసమే తెచ్చి పెట్టిందని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టు పార్టీకి చెందిన మహామహా యోధులు గెలిచారని తెలిపారు. ఆ పార్టీల ప్రభావం అక్కడ ఇప్పటికీ ఉందని చెప్పారు. అందువల్ల బీజేపీ ఆటలు మునుగోడులో సాగబోవని హరీశ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.