Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబరు 11 నుంచి 15వ తేదీ వరకు
- ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ-జేఈఓ వీరబ్రహ్మం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జరిగే నిత్య, వార సేవలు, ఉత్సవాలను చూసే అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు కల్పించనున్నట్టు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. అక్టోబరు 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనికోసం పది రోజుల ముందునుంచే ప్రచార రథాల ద్వారా విస్తతంగా ప్రచారం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వైభవోత్సవాల ఏర్పాట్లపై సోమవారంనాడాయన అధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేడియంలో భక్తులు సులువుగా గుర్తించగలిగే ప్రాంతంలో టీటీడీ పంచగవ్య ఉత్పత్తుల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వేదికతో పాటు స్టేడియంలో శోభాయ మానంగా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, ఫ్లెక్సీలు, ఆర్చిల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. పారిశుద్ధ్యం, అన్నప్రసాదాల పంపిణీ, రవాణా, వసతి, ఫొటోఎగ్జిబిషన్ ఏర్పాట్లపై ప్రత్యేకశ్రద్ధ వహించాలన్నారు. నెల్లూరు వైభవోత్సవాల తరహాలో పోటు, ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బంది పడకుండా జర్మన్ షెడ్డు నిర్మించాలని చెప్పారు. సేవల కోసం తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలన్నారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహ్వానపత్రికలు, భక్తులకు పాసులు అందించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వేదిక మీద ఉండే సిబ్బంది, అధికారులు తప్పనిసరిగా టీటీడీ డ్రెస్‌కోడ్ పాటించాలన్నారు. సేవల ప్రారంభానికి ముందు ప్రవచనాలు, ఆయా సేవల విశిష్టతను భక్తులకు తెలియజేసేందుకు ఇప్పటినుంచే తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సంగీత, నత్య కార్యక్రమాలు ప్రదర్శించేలా కళాకారులను ఎంపిక చేయాలని సూచించారు. స్వామివారి సేవలను అద్భుతంగా వివరించగలిగే వ్యాఖ్యాతలను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన శ్రీమతి రాధ హర్షవర్ధన్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఎస్ఈలు జగదీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వీజీఓ మనోహర్, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీమతి విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ, శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీహరి, హైదరాబాద్ శ్రీవారి ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.