Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీలో చేరేందుకు తాను రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకున్నట్టు ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారనీ, అందువల్ల అయన్ను ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు టీఆర్ఎస్ బృందం ఫిర్యాదు చేసింది. ఆదివారం హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని వికాస్‌రాజ్ నివాసానికి టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ వెళ్లారు. రాజగోపాల్‌రెడ్డి ఇంటర్వ్యూకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. అనంతరం లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బీజేపీ ప్రభుత్వం నుంచి 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు రాజగోపాల్‌రెడ్డి ఓ టీవీ ఛానల్‌తో చెప్పారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్య అని అన్నారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్‌ను గాలికొదిలేశారని విమర్శించారు. ఆయన కిడ్ప్రోకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశామన్నారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చి రాజగోపాల్ రెడ్డిని మునుగోడులో పోటీ చేయకుండా చేయాలని కోరారు. ఎమ్మెల్యే కిశోర్ మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఈటల రాజేందర్, వివేక్‌లకు కూడా వాటా ఇస్తామంటూ రాజగోపాల్‌రెడ్డి చెప్పారనే ప్రచారం జరుగుతున్నదన్నారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని మోడీ, అమిత్ షా కాళ్ళ దగ్గర ఆయన తాకట్టు పెట్టాడని ఆరోపించారు. ప్రజల బాధల గురించి ఏనాడూ పట్టించుకోని రాజగోపాల్‌రెడ్డి పైసల అహంకారంతో ఎన్నికకు వెళ్లాడని విమర్శించారు. మునుగోడు ప్రజలకు ఆయనకు తగిన గుణపాఠం చెప్పబోతున్నారన్నారు.