Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31న సెక్యూరిటీ కార్మికుల ఆల్ ఇండియా డిమాండ్స్ డే : సీఐటీయూ ఆలిండియా ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వివిధ సంస్థల ఆస్తుల రక్షణకు పహారా కాస్తున్న ప్రయివేటు సెక్యూరిటీ గార్డులకు, కార్మికులకు రక్షణ కల్పించాలని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు, ప్రయివేటు సెక్యూరిటీగార్డ్స్, అలైడ్ వర్కర్స్ యూనియన్స్ నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎం.సాయిబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్టోబర్ 31న జరిగే సెక్యూరిటీ అండ్ ఎలైడ్ కార్మికుల ఆల్ ఇండియా డిమాండ్స్డేను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం గోల్కొండ క్రాస్‌రోడ్‌లోని సీఐటీయూ కార్యాలయంలో కె.ఈశ్వరరావు అధ్యక్షతన తెలంగాణ ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఎలైడ్ వర్కర్స్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు దేశంలో ప్రభుత్వరంగ, ప్రయివేటు పరిశ్రమలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, తదితర కార్యాలయాల్లో లక్షలాది మంది సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారని తెలిపారు. ఆస్తులను కాపాడుతున్న ఈ కార్మికుల ఉద్యోగాలకు రక్షణ కల్పించడంలో, కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అనేక సంస్థలలో 12 గంటలు పని చేయించుకుంటున్నారని తెలిపారు. బోనస్ చెల్లించడంలేదనీ, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ సౌకర్యాలు కూడా కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలతో సతమతమవుతున్న ప్రయివేటు సెక్యూరిటీ గార్డులందర్నీ దేశవ్యాప్తంగా ఐక్యం చేసేందుకు సీఐటీయూ కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ అలైడ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు బి. మధు, కె. ఈశ్వరావు, పి.గణేష్ , జె. వెంకన్న , పి. శ్రీకాంత్ , హెచ్.దామోదర్, సత్యనారాయణ, జి.రామారావు, కె. శ్రీనివాస్ రెడ్డి, కె. రామకృష్ణ, ఎస్.శోభ, జి. శ్రీహరి, సీహెచ్ వి.వి.రెడ్డి, జి. నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.