Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లలదే
- హైకోర్టు న్యాయమూర్తి జి రాధారాణి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పిల్లల సంరక్షణ కేంద్రాల తరహాలోనే సమాజంలో వృద్ధాశ్రమాల ఏర్పాటు అవసరమని హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ జి రాధా రాణి చెప్పారు. సంపాదన మొత్తం పిల్లలకే ఇచ్చి, ఆ తర్వాత వారిపై ఆధారపడడం బాధాకరమని అన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలనీ, అనంతరం సంపాదన ఇచ్చుకోవచ్చని సూచించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఆడ,మగ ఇద్దరు పిల్లలపైనా ఉంటుందనీ, ఇది వారి కర్తవ్యమని చెప్పారు. వృద్ధుల అనుభవాలు విజ్ఞానపు ఘనులనీ, వాటిని ఇతరులకు అందించాలని కోరారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో చండ్ర రాజేశ్వరరావు (సీఆర్) ఫౌండేషన్ వృద్ధాశ్రమ 23వ వార్షికోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సభకు సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత మహాత్మా గాంధీ, చండ్ర రాజేశ్వరరావు చిత్రపటాలకు జస్టిస్ రాధారాణి, సురవరం సుధాకర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ దేశంలో 15 కోట్ల వృద్ధుల జనాభా ఉందనీ, 2050 నాటికి ఆది మరో మూడు రెట్లు పెరుగుతుందని చెప్పారు. వారి సంఖ్యకనుగుణంగా వృద్ధాశ్రమాలు పెరగాలన్నారు. మారుతున్న సమాజంలో వృద్ధాశ్రమాల అవశ్యకత మరింత పెరిగిందన్నారు. వారికి మంచి సేవలందిస్తున్న సీఆర్ ఫౌండేషన్ నిర్వాహకులను ఆమె అభినందించారు. వృద్ధాశ్రమాలంటే అనాథాశ్రమాలనుకోవడం పొరపాటని సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఉద్యోగాల పేరుతో పిల్లలు దూరంగా ఉన్నప్పడు, అనేక కారణాలతో సుదూరప్రాంతాలకు వెళ్లినప్పుడు, తల్లిదండ్రులకు తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్న నేపథ్యంలో అవి ఎంతో అవసరమని వివరించారు. చండ్ర రాజేశ్వర్‌రావు గొప్ప దేశ భక్తుడనీ, నిజాం నిరంకుశ పాలనకు, తీవ్రమైన ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఆయన కోరిక మేరకు చిన్న వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా సీఆర్ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టామని వివరించారు. చికిత్సాలయం, లైబ్రరీ, నీలం రాజశేఖర్‌రెడ్డి రీసర్చ్ సెంటర్, మహిళా స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఈ ఫౌండేషన్ నిర్వహిస్తున్నదని అన్నారు. కరోనా సమయంలో జూమ్, హాల్ సమావేశాలను నిర్వహించి, సుమారు 19, 20 అంశాలపై నిష్ణాతులతో ఉపన్యాసాలు ఇప్పించామని గుర్తు చేశారు. సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ వృద్దులు నిరాశ నిస్పృహలకు గురికావొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శులు చెన్నమనేని వెంకటేశ్వర్, పిజె చంద్రశేఖర్, సభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చెన్నకేశవరావు, హెల్త్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రజనీ హాజరయ్యారు.