Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షలో మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొన్ని ఆస్పత్రుల్లో అవసరానికి మించి డాక్టర్లున్న నేపథ్యంలో వారిని అవసరమున్న ఆస్పత్రులకు డిప్యూటేషన్ పై పంపించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీ) పరిధిలోని ఆస్పత్రులపై ఆయన నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు, ఆపరేషన్ థియేటర్లలో ఎయిర్ క్వాలిటీ చెకింగ్ తప్పనిసరి చేయాలని కోరారు. అందరికి కనబడేలా ఆయా ఆస్పత్రుల్లో డైట్ మెనూను డిస్ప్లే చేయాలని సూచించారు. శానిటేషన్, డైట్ కాంట్రాక్టు బిల్లులను నిర్దిష్ట సమయంలోపు చెల్లించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లదేనని స్పష్టం చేశారు. వాటి పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర స్థాయి వైద్యాధికారికి అప్పగించాలన్నారు. టీవీవీ పరిధిలోని 171 ఆస్పత్రులకుగాను 152 శానిటేషన్ కాంట్రాక్టులు పూర్తి కాగా మిగిలిన 19 ఆస్పత్రులవి త్వరలో పూర్తవుతాయని తెలిపారు. డైట్ కాంట్రాక్టులు 162 పూర్తి కాగా మరో ఆరు ఆస్పత్రులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. చికిత్సకు వచ్చిన వారి నుంచి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులకు రక్తం ఇచ్చే సందర్భంలో పూర్తి రక్తం కాకుండా బ్లడ్ సపరేటర్ ద్వారా వారికి అసరమైన ప్లేట్లెట్స్ లేదా ప్లాస్మా లేదా మరేదైనా విడిగా ఇవ్వాలని సూచించారు. 18 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 133 మంది మిడ్వైఫరీ నర్సులను త్వరలోనే వివిధ విభాగాల్లో నియమిస్తామని ప్రకటించారు. పేషెంట్లను తీసుకొచ్చే ఆశాలకు ప్రత్యేక రూం ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు.