Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రకరకాల పేర్లతో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు
- ప్రమాదంలో ప్రజాస్వామ్యం: ప్రముఖ రచయిత్రి అరుంధతీరారు ఆందోళన
నవతెలంగాణ-అడిక్మెట్
భారత సైన్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన మనుషులనే రిక్రూట్ చేస్తున్నారని ప్రముఖ రచయిత, మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత ఆరుంధతీరారు అన్నారు. దీనికోసం వారు రకరకాల పేర్లతో ట్రైనింగ్ ఏజెన్సీలను ఏర్పాటు చేశారనీ తెలిపారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికై, శిక్షణ ముగించుకొని నాలుగేండ్ల తర్వాత బయటకు వచ్చిన వారితో పార్టీ ఆర్మీని తయారు చేయాలనే కుట్ర దీనివెనుక ఉన్నదని వివరించారు. భారత ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కులమతాల పేరుతో నియంతృత్వ ఉద్యమాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతున్నది కూడా దానికోసమేనని వివరించారు. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలగోపాల్ 13వ స్మారక సమావేశం జరిగింది. ఈ సభకు ఆమె ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్టులందరికీ నచ్చే విధంగా, గోబెల్స్ ప్రచారాలతో 'అదే కరెక్ట్' అనే విధంగా కుట్రలు చేస్తున్నదనీ, దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందన్నారు. దేశంలోని హిందూ, ముస్లిం మహిళలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేస్తున్నాయనీ, వాటి వ్యవహారశైలిని సునిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందంటూ 'హిజాబ్' అంశాన్ని ఉదహరించారు. అయితే అనూహ్యంగా దేశంలో అవకాశవాదులు, నిజాయితీలేని వారి సంఖ్యే ఎక్కువగా ఉందని విమర్శించారు. తప్పు అని తెలిసినా, దాన్ని ఎత్తిచూపకపోగా, మౌనంగా ఉండటమో, లేక మెజార్టీ నిర్ణయం పేరుతో స్వాగతించడమో చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని ఆర్థిక విధానాలు బీఎండబ్ల్యూ కారుకూ, ఎడ్ల బండికి మధ్య పోటీ పెట్టినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అదానీ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పోయారనీ, అందుకే ఎనిమిదేండ్లలో 8 బిలియన్ డాలర్ల నుంచి 130 బిలియన్ డాలర్ల ఆస్తిని పెంచుకున్నాడని చెప్పారు. త్వరలో అమిత్ షా కొడుకు కూడా ఆ లిస్టులో చేరబోతున్నారన్నారు. కర్నాటకకు చెందిన కార్మిక నేత క్లిఫ్టన్ డీ రోజారియో మాట్లాడుతూ.. మోదీ ఫాసిస్టు భావజాలానికి ముఖం లాంటి వారని విమర్శించారు. దేశంలో కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. సమావేశంలో మిహిర్ దేశారు, జహా ఆరా తదితరులు పాల్గొన్నారు.