Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజల్లో మానసిక వ్యాధుల పట్ల అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాదీ అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మంది మానసిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మరో కోటి నుంచి రెండు కోట్ల మంది ఆ ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. శారీరక రోగాల పట్ల ప్రజలకు కొంత మేరకైనా అవగాహన ఉంటుండటంతో వారు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటారు. అయితే మానసిక రోగాల పట్ల అలాంటి అవగాహన కొరవడడంతో ముదిరిన తర్వాతే ఎక్కువ మంది తమను సంప్రదిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆత్మహత్యల్లో 32 శాతం మన దేశంలోనే జరుగుతుండటం, అందులోనూ 90 శాతం మానసిక సమస్యల వల్లే కావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది. 36 శాతం మంది భారతీయులు ఏదో ఒక సందర్భంలో మానసిక వ్యాధికి గురైన వారే ఉండటం, ప్రాణాలు తోడేస్తున్న క్యాన్సర్ తర్వాత ఆ స్థానాన్ని మానసిక రోగాలు భర్తీ చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. భారతీయ మహిళల్లో 42 శాతం మంది డిప్రెషన్ సమస్యతో బాధ పడుతున్నట్టు దేశీయంగా నిర్వహించిన సర్వే ఒకటి వెల్లడించింది.
జీవితంపై మమకారం తగ్గే ప్రమాదం...హిప్నో పద్మాకమలాకర్
'ఊహలకూ వాస్తవాలకూ మధ్య దూరం పెరిగేకొద్దీ జీవితం పట్ల మమకారం తగ్గుతుంది. నిరాశ అధికం అవుతుంది. నిస్పృహ ఆవరిస్తుంది. అపుడు విపతీర పరిణామాలు ఎలాగైనా ఉండొచ్చు. మనో వైకల్యానికి అవి కారణం కావచ్చు, ఆత్మహత్యలకు దారితీయవచ్చు. హత్యలకు ఉసిగొల్పవచ్చు. విడాకులు దాకా వెళ్లవచ్చు. ఉద్యోగాన్ని కోల్పోవాల్సి రావచ్చు, వ్యాపారంలో దివాలా తీయొచ్చనీ....' కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్ హెచ్చరించారు. ఇలాంటి వారు తమ మనసును గెలవడానికి ప్రయత్నించాలని సూచించారు.