Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యకలాపాలను అడ్డుకున్న వీఆర్ఏలు
- సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని దాదాపు మూడు నెలలుగా సమ్మె చేస్తున్న వీఆర్ఏలు సోమవారం రెవెన్యూ కార్యకలాపాలను అడ్డుకున్నారు. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా.. పలువురు వీఆర్ఏలు చనిపోయినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయాలకు తాళం వేసి నిరసన తెలిపారు. ఆఫీసుల ఎదుట బైటాయించారు.
ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. ఖమ్మం జిల్లా మధిరలో రెవెన్యూ అధికారులను కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కూసుమంచిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించి నినాదాలు చేశారు. ముదిగొండ, ఎర్రుపాలెం, మధిర మండలాల్లో కార్యాలయాలకు తాళం వేసి తహసీల్దార్లను అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. దుమ్ముగూడెంలో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పినపాకలో తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేశారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. వీఆర్ఏల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ జిల్లా నాయకులు నందిమల్ల రాములు మాట్లాడారు. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం గేటు మూసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో తహసీల్దార్ కార్యాలయాలను దిగ్బంధించారు. మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు తాళం వేసి నిరసన తెలిపారు.
తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలకు తాళం వేసి వీఆర్ఏలు నిరసన తెలిపారు. సమ్మెలో భాగంగా వీఆర్ఏలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. జన్నారం, కాసిపేట తహసీల్దార్ కార్యాలయాలకు తాళం వేసి ఉద్యోగులను అడ్డుకున్నారు. అనంతరం తహసీల్దార్ ఇటిక్యాల కిషన్‌కు వినతిపత్రం అందజేశారు. నస్పూర్, సిర్పూర్(టి)లో తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. కార్యాలయంలోకి తహసీల్దార్‌ను, ఇతర సిబ్బందిని వెళ్లకుండా అడ్డుకున్నారు. సారంగాపూర్ తహసీల్ధార్ కార్యాలయానికి వీఆర్ఏలు తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. నార్నూర్‌లో వీఆర్ఏలకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు లంక రాఘవులు మద్దతు తెలిపారు. బెజ్లూర్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి వీఆర్ఏలు నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో కార్యకలాపాలు గంట ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దహెగాం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించిన వీఆర్ఏలు సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకుని నిరసన తెలిపారు.