Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు బరి నుంచి తప్పుకుంటాం.. : విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీని ఓడించాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- మునుగోడు
రాష్ట్రంలో అభివృద్ధి కోసం రూ.18 వేల కోట్లు ఇస్తే మునుగోడు ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌లో సోమవారం సీపీఐ(ఎం), సీపీఐ నాయకులతో కలిసి మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుళ్లు, కుతంత్రాలకు తెరలేపిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అర్ధ రూపాయి ఇవ్వడం చేతకాదు.. కానీ స్వార్థ రాజకీయాల కోసం ఉపఎన్నికలు సృష్టించేందుకు పదవిలో ఉన్న ఎమ్మెల్యేకు రూ.18 వేల కాంట్రాక్టు ఇచ్చిందని ఆరోపించారు. జిల్లా అభివృద్ధి కోసం ఆ రూ.18 వేల కోట్లు విడుదల చేస్తే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని బరిలో దింపకుండా కేసీఆర్‌ను ప్రాధేయపడ్తామని చెప్పారు. నిధులు విడుదల చేసే సత్తా ప్రధాని మోడీ, అమీత్‌షాకు ఉందా అని సవాల్ విసిరారు. పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణలో మంటలు పెట్టే శక్తులు తయారయ్యాయన్నారు. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రితోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ శాఖల కేంద్ర మంత్రులు అనేక మార్లు ఉత్తిగనే తెలంగాణలో పర్యటించారే తప్ప.. ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి పైసా విదిల్చలేదన్నారు. భవిష్యత్ తరాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది ఉండొద్దనే సంకల్పంతో ముందెన్నడూ లేని రీతిలో నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద రూ.30,000 వేల కోట్లతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తున్నా కేంద్రం నిధులు విడుదల కావడం లేదన్నారు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని విమర్శించారు. మూడున్నరేండ్ల కాలంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న మునుగోడును అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఆశీర్వదించి కేసీఆర్‌కు కానుకగా ఇచ్చేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఏడు దశాబ్దాలుగా పోగవుతూ వచ్చిన ప్రభుత్వ సంపదను ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో దేశం నిలువు దోపిడీకి గురవుతోందన్నారు. ఇప్పటికైనా దేశ ప్రజలు మేలుకోకపోతే.. బీజేపీ దేశాన్ని పూర్తిగా అమ్ముకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పతనం మునుగోడు నుండే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీని బలపర్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అతన్ని కొనుక్కుందని అతనే స్వయంగా ఒప్పుకున్నాడని చెప్పారు. ఈ ఉప ఎన్నిక కాంట్రాక్టులు, స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిందే తప్ప మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదన్నారు. ప్రాంతీయ పార్టీలను, కమ్యూనిస్టులను అణచివేసే కుట్ర జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, వైస్‌ఎంపీపీ అనంత వీణ స్వామిగౌడ్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్, చాపల మారయ్య, సీపీఐ(ఎం), సీపీఐ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.