Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖుల నివాళి
- నేడు స్వగ్రామం సఫారులో అంత్యక్రియలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) సోమవారం తుదిశ్వాస విడిచారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆరు దశాబ్ధాలకుపైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏడుసార్లుగా ఎంపీగా, పదిసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కేంద్రమంత్రిగా ఆయా హోదాల్లో పనిచేసిన ఆయన దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. రాజకీయ మల్లయోధుడిగా పేరొందిన ములాయం సింగ్ యాదవ్ నవంబరు 22,1939లో యూపీలోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో ఓ పేదరైతు కుటుంబంలో జన్మించారు. ఆగ్రా వర్సిటీ పరిధిలోని బీఆర్ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చదివారు. అనంతరం కర్వ్తెలో లెక్చరర్‌గా పనిచేశారు. రెజ్లింగ్ పట్ల ఎంతో మక్కువ ప్రదర్శించే ములాయం, అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయ మల్లమోధుడిగా ఎదిగారు. సోషలిస్ట్ నాయకులు డాక్డర్ రాంమనోహర్ లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ములాయం చిన్న వయసులోనే రాజకీయాల వైపు ఆసక్తి కనబరిచారు. మధులిమాయే, రామ్‌సేవక్ యాదవ్, కర్పూరి ఠాకూర్, జానేశ్వర్ మిశ్రా, రాజ్‌నారాయణ్ వంటి వ్యక్తులతో పరిచయం అయిన తర్వాత 15 ఏండ్ల వయసులోనే రాజకీయాల్లో చేరారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్‌సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్ పనితీరుతో ప్రేరణపొందారు. కార్మికులు, రైతులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, విద్యార్థుల సంక్షేమం, హక్కుల రక్షణ కోరుతూ మూలాయం అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలో 1962 నుంచి 1963 వరకు ఇటావా డిగ్రీ కళాశాల్లో విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో అరెస్టయి జైలుకు వెళ్లిన ములాయం.. 19 నెలలపాటు నిర్భంధంలో ఉన్నారు. 1977లో తొలిసారి మంత్రి అయ్యారు. సహకార, పశుసంవర్థకశాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1980లో లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ పార్టీ తర్వాత జనతాదళ్‌లో భాగమైంది. 1990లో కేంద్రంలోని వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోవడంతో చంద్రశేఖర్ సారథ్యంలోని జనతాదళ్(సోషలిస్టు)పార్టీలో మూలాయం చేశారు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో యూపీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 1991లో కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ములాయం పార్టీపై బీజేపీ గెలిచింది. అనంతరం 1992లో ములాయం సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. 1993లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుపెట్టుకుని గెలిచారు. దీంతో కాంగ్రెస్, జనతాదల్ మద్దతుతో రెండో దఫా ముఖ్యమంత్రిగా ములాయం విజయం సాధించారు. మిత్రపక్షాలతో విభేదాలు రావడంతో 1995లో ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. ఇక 2002లో బీజేపీతో కలిసి మాయావతి నేతృత్వంలలోని బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కాగా 2003లో బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ సర్కారు పడిపోయింది. దీంతో రాజకీయ వ్యూహ పరిణితి ఉన్న ములాయం రెబల్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మరోసారీ సీఎం అయ్యారు. ప్రస్తుతం ములాయం మెయిన్‌పురి ఎంపీగా కొనసాగుతున్నారు. రాంమనోహర్‌లోహియా శిష్యుడిగా ఉన్న ములాయం వ్యాపార, రాజకీయ ప్రతినిధిగా ఉన్న అమర్‌సింగ్‌ను చేరదీశాడు. ఆ తర్వాత అనవసరం అనుకున్న 'ఎక్స్ట్రా బ్యాగేజీని' పార్టీ నుంచి వెళ్లగొట్టాడు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం తన విధిగా భావించాడు. మైనార్టీలను సైతం నిరంతరం వెనుకొచ్చేతత్వం ఆయనది. అందుకే ఆయనకు 'ముల్లా మౌలానా' అని ఆ రాష్ట్రంలో పిలుచుకునేవారు. అదే ఆయన్ను జాతీయ రాజకీయాల్లో నిలిపింది. దీంతో కాంగ్రెస్‌ను యూపీలో లేకుండా చేయడానికి ఉపయోగపడింది. కొంతమేర బీఎప్పీ నేత కాన్షిరాం ఆలోచనలను కలిగిఉండేవారు. ఆయన చనిపోయేవరకు కుల రాజకీయాలు చేశాడనే వ్యాఖ్యానాలు ఉండనే ఉన్నాయి.
1990ల్లో బాబ్రీ మసీదు రక్షణలో జరిగిన కాల్పుల్లో కొందరు కరసేవకులు పోలీసు కాల్పుల్లో మరణించారు. ధైర్యంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని తనను తాను సమర్థించుకున్నాడు ములాయం. అందుకే ఆయనకు ముల్లా యాదవ్ అని, మౌలానా అని బీజేపీ వాళ్లు పేర్లు పెట్టారు. యూపీలో పెద్దఎత్తున ముస్లింలు ఈయనకు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. జాతీయ రాజకీయాల్లో ఆయనను ఉన్నత స్థానంలో నిలిపింది ఇదే.
నివాళీ
ములాయం సింగ్ యాదవ్ మరణానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డి దేవ్‌గౌడ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, కేరళ మఖ్యమంత్రి పినరయి విజయన్, ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.
మతతత్వ శక్తులతో పోరు
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీపీిఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈమేరకు విడుదల చేసిన ప్రకటనలో సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటంతో ఆయన ప్రముఖ నేతగా ఆవిర్భవించారని పేర్కొంది. మతతత్వ శక్తులతో పోరాటం, లౌకిక వాద పరిరక్షణకు మూడు దశాబ్దాలుగా ఆయన గణనీయమైన కృషి చేశారని తెలిపింది. క్లిష్టమైన సమయాలలో లౌకిక శక్తుల కూటమి ఏర్పాటు చేయడంలో సిపిఎం, వామపక్షాలతో కలిసి పనిచేశారని పేర్కొంది. అఖిలేష్ యాదవ్, ములాయం కుటుంబ సభ్యులందరికీ, సమాజ్‌వాద్ పార్టీ శ్రేణులకు హృదయపూర్వక సానుభూతిని తెలిపింది.
జీవితాంతం పేదల కోసమే పోరాడారు
- ములాయం మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నేడు యూపీకి...
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకు డు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన జీవితాంతం నిరుపేదలు, బడు గు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసమే పని చేశారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్ మనో హర్ లోహియా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములా యం రాజకీయాల్లోకి వచ్చారని తెలి పారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌కు మూడు సార్లు ముఖ్యమంత్రి గా, కేంద్ర మంత్రిగా పని చేసిన ఆయన మరణం దేశానికి తీరని లోట ని పేర్కొన్నారు. ములాయం కుమారు డు అఖిలేశ్ యాదవ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకోసం కేసీఆర్ మంగళవారం యూపీకి బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడి ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామమైన సైఫరుకు వెళ్లి... ఆయన భౌతికకాయానికి నివాళులర్పిస్తారు. అంత్యక్రియల్లో సైతం సీఎం పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.