Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న ఇరుపార్టీల నేతలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికల్లో మతోన్మాద బీజేపీని అడ్డుకోవడానికి వామపక్షాలు కదనరంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం చండూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రెండ్రోజుల నుంచి నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో వామపక్ష పార్టీల నేతలంతా సభలు, సమావేశాలు నిర్వహించి, బహిరంగ సభ ప్రాధాన్యత వివరిస్తున్నారు. అదే క్రమంలో ఇంటికో మనిషి, ఊరికో వాహనం అనే పద్ధతిలో జనం చండూరు తరలిరావాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు చెందిన సీపీఐ(ఎం), సీపీఐ నేతలంతా గ్రామగ్రామాన పర్యటన చేస్తున్నారు. బీజేపీ మోస పూరిత విధానాలు, మతోన్మాద దాడులపై కళారూపాలు, పాటల రూపంలో ప్రజలకు వివరిస్తున్నారు. సీపీఐ(ఎం), సీపీఐ తమ బలాన్ని మరోసారి నిరూపించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. వామపక్ష భావాలకు కేంద్రమైన మునుగోడులో ఫాసిస్టు ఉన్మాద శక్తులకు అవకాశం కల్పించొద్దని ప్రజలకు ఈ సభ ద్వారా పిలుపునివ్వడం కోసం నేతలు కృషి చేస్తున్నారు. చండూరు మండల కేంద్రంలోని రాజకుమారి మినీ ఫంక్షన్హాల్లో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు. ఈ సభకు సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు, నల్లగొండ, యాదాద్రి జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎండీ జహంగీర్, నెల్లికంటి సత్యం, గోదా శ్రీరాములు పాల్గొననున్నారు.