Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ అంబటి సురేందర్ రాజు, సుద్దాల అశోక్ తేజ
- గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు వర్ధంతి
నవతెలంగాణ-మియాపూర్
నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట ఉద్యమానికి తన పాటల ద్వారా సుద్దాల హనుమంతు ఊపిరి పోశారని ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ అంబటి సురేందర్ రాజు, సుద్దాల అశోక్ తేజ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు ఆడిటోరియంలో సుద్దాల హనుమంతు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నైజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అనేక రంగాల కవులు, రచయితలు, కళాకారులతోపాటు సుద్దాల హనుమంతు పాట ఎంతగానో తెలంగాణ ప్రజలందరినీ చైతన్యవంతులను చేసిందని చెప్పారు. నాటి నుంచి నేటికీ సమాజంలో అనేక రూపాల్లో పాలకులు ప్రజలను పీడిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన నుంచి నేటి వరకు తెలంగాణ సమాజంలో నాటి యోధులు కన్న కలలు ఇంకా సాకారం లేదని తెలిపారు. వాటిపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారు ఏర్పాటు చేసిన సుద్దాల హనుమంతు వర్ధంతి సభలో తన తండ్రి గురించి మాట్లాడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, వారి పోరాట స్ఫూర్తి.. వారు ఇచ్చిన ఉద్యమ కర్తవ్యాన్ని తనవంతుగా ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేస్తానని సుద్దాల అశోక్‌తేజ అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ''ప్రజాస్వామ్యం'' నాటికను ప్రదర్శించారు. నాటికను చూసిన సుద్దాల అశోక్ తేజ.. విద్యార్థులకు వారు ఎంచుకున్న సబ్జెక్టుపై అనేక సూచనలు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి వీధి నాటకాలు మరిన్ని ప్రదర్శనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వినయకుమార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ రాములు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు శోభన్, కృష్ణ, శ్రీనివాస్, అభిషేక్ నందన్, శిరీష తదితరులు పాల్గొన్నారు.