Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లిష్టకాలంలో ఒకరికొకరం సహాయం చేసుకోవాలి
- ప్రయివేటు భాగస్వామ్యానికి అంతరిక్షాన్ని తెరిచిఉంచాం
- వర్చువల్ సందేశంలో ప్రధాని నరేంద్రమోడీ
- హైదరాబాద్‌లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆధునిక సాంకేతికత లక్ష్యం ప్రపంచ దేశాల సమిష్టి అభివృద్ధే అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. క్లిష్ట సమయాల్లో అంతర్జాతీయంగా ఒకదేశం మరో దేశానికి సహయ, సహకారాలు అందించుకోవడానికి సాంకేతికత దోహదపడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఐదు రోజుల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌లో ఈ సమావేశాలను ప్రారంభించి, మాట్లాడారు. సాంకేతికత, అభివృద్ధిలో ప్రపంచంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదనీ, అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందాలని చెప్పారు. సాంకేతికత అభివృద్ధి, వినియోగంలో భారతదేశం అందర్నీ కలుపుకొని వెళ్తుందని వివరించారు. హైదరాబాద్ నగరం హైటెక్ విజన్‌కు ప్రసిద్ధి చెందినదని చెప్పారు. అభివృద్ధి వరుసలో చిట్టచివరి స్థానంలో ఉన్న వ్యక్తిని సైతం స్వయం శక్తితో వృద్ధిలోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో బ్యాంకింగ్ సదుపాయానికి దూరంగా ఉన్న 450 మిలియన్ల మంది ప్రజలకు ఏకకాలంలో బ్యాంకింగ్ సౌకర్యం కల్పించామనీ, దీనికి సాంకేతికత ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఈ సంఖ్య అమెరికా దేశ జనాభాతో సమానమని చెప్పారు. అలాగే ఫ్రాన్స్ దేశ జనాభాకు రెండింతలుగా ఉన్న 135 మిలియన్ల మంది ప్రజలకు బీమా సౌకర్యాన్ని కూడా సమకూర్చామన్నారు. సమాజంలో ఏ ఒక్కరూ కనీస సౌకర్యాలు నోచుకోకుండా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జన్‌ధన్ ఖాతా, ఆధార్, మొబైల్ త్రయం 800 మిలియన్ ప్రజల సంక్షేమ ప్రయోజనాలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉపయోగపడుతున్నాయని ఉదహరించారు. మహిళల స్వశక్తి సహా అనేక రంగాల్లో దేశం సాంకేతికతను వినియోగిస్తున్నదని చెప్పారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివద్ధి, పేదరిక నిర్మూలన, మహిళలు- పురుషుల మధ్య సమానత్వాలపై సాంకేతికత ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగిఉందని తెలిపారు. జియో స్పేషియల్ టెక్నాలజీ ద్వారా పీఎమ్ గతిశక్తి మాస్టర్‌ప్లాన్ మరింత బలోపేతం అవుతుందన్నారు. భారతదేశం యువ దేశం అనీ, ఇక్కడ నూతన ఆవిష్కరణలకు అత్యంత ప్రధాన్యత ఉంటుందని చెప్పారు. దానికోసమే స్టార్టప్‌లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. డ్రోన్ సెక్టర్‌ను ప్రోత్సహిస్తూ, ప్రయివేటు భాగస్వామ్యానికి అనువుగా అంతరిక్ష రంగాన్ని తెరిచి ఉంచామనీ, దానిలో భాగంగానే 5 జీని ప్రవేశపెట్టామన్నారు. కోవిడ్ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిందనీ, దానినుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఆ సమయంలోనే ప్రపంచదేశాలు ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడ్డాయని ఉదహరించారు. జియో స్పేషియల్ టెక్నాలజీ ద్వారా స్థిర ప్రాతిపదికన పట్టణ ప్రాంతాల అభివద్ధి, విపత్తుల వేళల్లో నిర్వహణ, వాటి ప్రభావాన్ని తగ్గించడం, జల, వాయు పరివర్తన ప్రభావాన్ని గమనించడం, అటవీప్రాంతాల నిర్వహణ, జల నిర్వహణ, ఎడారీకరణను నిరోధించడం, ఆహార సంరక్షణ వంటి అనేక ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ జియో స్పేషియల్ ఇండిస్టీతో సంబంధం కలిగిన అన్ని వర్గాలు ఒక చోటకు చేరి, విధాన నిర్ణయాలపై చర్చించుకోవాలనీ, ఆ మేరకు ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలని అకాంక్షించారు. ార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్ర శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ భారతదేశ భౌగోళిక ఆర్థిక వ్యవస్థ (జియోస్పేషియల్ ఎకానమీ) 2025 నాటికి 12.8 శాతం వద్ధి రేటుతో రూ. 63 వేల కోట్లు దాటి, 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా వేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జియోస్పేషియల్ ఇంక్యుబేటర్, సోలార్ కాలిక్యులేటర్, భూనిధి పోర్టల్, నేషనల్ టోపోనిమి డేటాబేస్‌ను ఆవిష్కరించి, 'ఐజీఐఎఫ్తో ఏకీభవించడంలో భారతదేశ అనుభవం' అనే నివేదికను విడుదల చేశారు. కార్యక్రమంలో భారత అంతరిక్ష శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్ సోమనాథ్, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ యూఎన్-జీజీఐఎం డైరెక్టర్ స్టీవన్ ష్వాన్ ఫెస్ట్, బెల్జియం యూఎన్ - జీజీఐఎం సహ అధ్యక్షుడు ఇంగ్రిడ్ వాండెన్బెర్గే తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సదస్సుకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఐదు రోజులు జరిగే ఈ సమావేశాల్లో 120 దేశాలకు చెందిన రెండు వేల మంది ప్రతినిధులు, 700 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు.