Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్లాది మంది ఉపాధిని దెబ్బతీసే చర్య : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హిందీని బలవంతంగా రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రపంచస్థాయి విద్యా సంస్థల్లో హిందీ మాద్యమంలోనే బోధన చేయాలంటూ అమిత్ షా కమిటీ నివేదికనివ్వటం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయించటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి బుధవారం లేఖ రాశారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషల్లో కాకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించాలనుకోవటం శోచనీయమని పేర్కొన్నారు. సమానావకాశాలను పొందేందుకు వీలుగా రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుని ఈ నిర్ణయం కాలరాస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులకు ఇప్పటి వరకూ నోటిఫికేషన్లు వేయని మోడీ ప్రభుత్వం... ప్రస్తుతం భర్తీ చేయబోయే ఉద్యోగాలకు మాత్రం హిందీ, ఆంగ్ల మాద్యమాల్లో పరీక్షలు నిర్వహించాలనుకోవటం దేశంలోని నిరుద్యోగ యువతకు ఆశనిపాతమని తెలిపారు. ఈ నిర్ణయం ప్రాంతీయ భాషల్లో చదువుకుంటున్న కోట్లాది మంది విద్యార్థులకు శాపంగా మారుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశ జనాభాలో 40 శాతం మంది మాత్రమే మాట్లాడే హిందీ భాషను మెజారిటీ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను ఇప్పటికైనా మానుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన హితవు పలికారు. సివిల్స్, రైల్వే, పోస్టల్, రక్షణ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నెట్, జనరల్ స్టడీస్తోపాటు కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో నిర్వహించబోయే పరీక్షలను ప్రాంతీయ భాషల్లో రాసేందుకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై తక్షణం ఒక నిపుణుల కమిటీని నియమించాలంటూ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.