Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీళ్ల కోసమే కొట్లాడినం
- మిషన్ భగీరథ పథకం ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ పథకమైంది
- ప్రతి గ్రామం గంగదేవిపల్లెగా మారింది : మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై మంత్రి దయాకర్‌రావు ప్రశంసలు
నవతెలంగాణ-హసన్‌పర్తి
మిషన్ భగీరథ పథకమే నన్ను టీఆర్ఎస్ పార్టీలో చేరేలా చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలకేంద్రంలోని చౌదరికుంట చెరువులోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో జరిగిన అధికారుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ముందుగా మిషన్ భగీరథ కార్యాలయం, నీటి శుద్దీకరణ, నాణ్యత ప్రమాణాల పరీక్షలు, పంపిణీ వంటి ఇతర అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో మిషన్ భగీరథ అనేక అవార్డులు సాధించిన సందర్భంగా ఆ శాఖకు చెందిన పలువురు ఇంజనీరింగ్, ఇతర అధికారులను సీఎంఓ అదనపు కార్యదర్శి స్మీతాసబర్వాల్తో కలిసి మంత్రి ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మనిషికి నిత్యావసరమైన మంచినీటిని శుద్ధి చేసి, పరిశుభ్రంగా ప్రజలకు అందించడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఏ ముహూర్తాన ఈ కార్యక్రమం చేపట్టాడో కానీ, అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని కొనియాడారు. తాను అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉండగా అనేక సార్లు నీళ్ల కోసం ప్రశ్నించానన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, స్మితా సబర్వాల్ తదితరులు బాగా కష్టపడ్డారని వారి కష్టానికి ఫలితంగానే ఈ రోజు అవార్డులు అందుకుంటున్నామన్నారు. వారి సేవలను గుర్తించి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. తాను ఈ శాఖకు మంత్రిగా వచ్చే సరికి, మిషన్ భగీరథ స్థిరీకరణ జరిగిందన్నారు. ఇప్పుడు అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. వాటిని మనం ఇవ్వాళ అనుభవిస్తున్నామని, ఆ కారణంగానే అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయని చెప్పారు. దేశానికే ఆదర్శంగా మిషన్ భగీరథ పథకం నిలిచిందన్నారు. మనం ఇస్తున్న మంచినీరు స్వచ్ఛమైనవని, ఆరోగ్యకరమైనవని కేంద్రప్రభుత్వం పార్లమెంటులో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చిందన్నారు. ఇప్పటి వరకు మన రాష్ట్రానికి 53 అవార్డులు వచ్చాయన్నారు. ఒకప్పుడు గంగాదేవి పల్లె మాత్రమే ఆదర్శంగా ఉండేదని, ఇవ్వాళ దేశంలో 20 గ్రామాలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణవే ఆదర్శ గ్రామాలుగా నిలిచాయన్నారు. నితి అయోగ్ సిఫారసు చేసినప్పటికీ కేంద్రం రాష్ట్రానికి రూ.19 వేల కోట్లు ఇవ్వలేదన్నారు. నయా పైసా ఇవ్వక పోయినప్పటికీ, కేవలం రాష్ట్ర నిధులతోనే మిషన్ భగీరథను పూర్తి చేశామన్నారు.
అనంతరం సీఎంఓ అదనపు కార్యదర్శి స్మీతాసబర్వాల్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకానికి అత్యధికంగా అవార్డులు రావడంలో అందరి కృషి ఉందన్నారు. అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ సిబ్బందికి, అధికారులకు అభినందనలు చెప్పారు. ఇంత గొప్ప శాఖకు తాను ఇన్చార్జిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. ప్రతి అధికారి ఇలానే కష్టపడి మరింత పురోగతిని సాధించి భవితరాలకు గొప్ప ఇంజనీర్లుగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, సీఎంఓ అధికారి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, వంగల్ నగర కమిషనర్ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ఎస్ఈ రామాంజనేయులు, మల్లేషం, 33 జిల్లాలకు చెందిన ఎస్ఈలు, సీఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలు, మిషన్ భగీరథ కార్యాలయాలకు చెందిన వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.