Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ నిర్మించిన కొల్లూరు, రాంపల్లి ఇండ్లకు అరుదైన గౌరవం
నవతెలంగాణ- సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ఇండియన్ అర్బన్ హౌసింగ్ కాంక్లేవ్-22 సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న హౌసింగ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ అధ్వర్యంలో చేపట్టిన కొల్లూరు 2వ దశ, రాంపల్లిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీని అక్కడ ప్రదర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో డిగ్నిటీ హౌసింగ్ కాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతో నిర్మించారు. తక్కువ స్థలంలో ఎక్కువ గృహ సముదాయాలను చేపట్టడమే కాకుండా కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా స్కూల్, అంగన్వాడీ సెంటర్, పార్క్, వాకింగ్‌ట్రాక్, ఓపెన్‌జిమ్, నిరంతర విద్యుత్, తాగునీటి సరఫరా, ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ, లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు, మెయింటెయిన్ కోసం రెవెన్యూ జనరేషన్ చేస్తున్నట్టు హౌసింగ్ అధికారులు వివరించారు. కొల్లూరు రెండో దశ ద్వారా 1354.59 కోట్లతో 15,660 గృహాల నిర్మాణం 117 బ్లాక్‌లలో చేపట్టారు. రాంపల్లిలో రూ.539.76 కోట్లతో 52 బ్లాక్‌లలో 6240 డబుల్ బెడ్ రూం ఇండ్లను చేపట్టినట్టు హౌసింగ్ అధికారులు వివరించారు. ఈ ప్రదర్శనలో హౌసింగ్ విభాగం ఎగ్జీక్యూటీవ్ ఇంజినీర్ వి.రవీందర్, డిప్యూటీ ఎగ్జీక్యూటీవ్ ఇంజినీర్లు బి.రఘునందన్, ధర్మారెడ్డి, శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజినీర్ మౌర్యతేజ తదితరులు పాల్గొన్నారు.