Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మంది మృతి
- వికారాబాద్‌లో ఆటోను ఢకొీట్టిన లారీ
- జోగిపేటలో రాంగ్ రూట్లో వచ్చిన ఆర్టీసీ బస్సు
నవతెలంగాణ-జోగిపేట/వికారాబాద్ ప్రతినిధి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతిచెందిన ఘటనలు వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో గురువారం చోటుచేసుకున్నాయి. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన దిలీప్(50) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నారు. జీడిమెట్ల నుంచి తన భార్య వినోద(44), కూతురు సుప్రతిక(24), మనవరాలు కానూషి(1)తో కలిసి మహారాష్ట్రలో తమ బంధువుల శుభకార్యానికి వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం మారుతి కారులో జీడిమెట్లకు వస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్పల్లి వద్ద నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్లో వచ్చి కారును బలంగా ఢకొీట్టింది. కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న దిలీప్, వినోద, సుప్రతిక, కానూషి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న జోగిపేట సీఐ నాగరాజు, ఎస్ఐ సౌమ్యానాయక్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో మృతదేహాలను బయటకు తీసి జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
వికారాబాద్ జిల్లా ధారూర్ పెద్దేముల్ మండలం మదనంతపూర్కు చెందిన సుమారు 15 మంది కూలీ పనుల కోసం వికారాబాద్‌కు ఆటోలో వెళ్తుండగా బాచారం వంతెన సమీపంలో ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢకొీట్టింది. దాంతో ఇద్దరు ఘటనా స్థలంలో, ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుల్లో ఆటో డ్రైవర్ ఎండీ జమీల్40), ప్రయాణికులు ఎన్ వినోద్(22), వి. రవి నాయక్(40), హేమ్లా నాయక్(30), ఏం కిషన్(45) కాగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన వెంటనే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులను తరలించేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను కలెక్టర్, ఎస్పీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని, క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.