Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దమ్ముంటే 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు నియోజకవర్గంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఓడిపోతే కుంగిపోమనీ, గెలిస్తే పొంగిపోబోమని చెప్పారు. టీఆర్ఎస్ బెదిరింపులకు తలొగ్గకుండా తమ కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి యుద్ధం చేశారన్నారు. టీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను 15 రోజుల్లోగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. దమ్ముంటే టీఆర్ఎస్లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. అధికారయంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేసినా టీఆర్ఎస్కు వచ్చింది 10 వేల మెజార్టీనే అని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతం అయిపోయిందన్నారు. టీఆర్ఎస్ వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేసినా, మందు ఏరులై పారించినా ఎన్నికల కమిషన్ ఏం చేసిందని ప్రశ్నించారు. మునుగోడులో కొందరు పోలీసులు, ఎన్నికల అధికారుల సహకారం వల్లనే టీఆర్ఎస్కు గెలుపు వచ్చిందని ఆరోపించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో సర్కస్ ఫీట్లు చేసినా జనం నమ్మడం లేదని విమర్శించారు. మునుగోడులో నైతిక విజయం బీజేపీ, రాజగోపాల్ రెడ్డిదే అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు వీరేందర్ గౌడ్, జె.సంగప్ప, ఐటీ విభాగం కన్వీనర్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.