Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు
- నేడు మేనూర్‌లో భారత్ జోడో గర్జన సభ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-పెద్దశంకరంపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టాయే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారన్నారు. వారి వారసుడిగా రాహుల్‌గాంధీ విశాల దేశ ప్రయోజనాల కోసం భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. నిఘా సంస్థలు రాహుల్ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించినా, కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులతో భయపెట్టినా ప్రజల కోసం, దేశం కోసం ధైర్యంగా యాత్ర మొదలు పెట్టారన్నారు. దేశంలో అస్తవ్యస్త పరిపాలన, క్లిష్టమైన పరిస్థితులు నెలకొనడంతో పాటు ప్రజలు తమ సమస్యలు, బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ దుస్థితి నెలకొందన్నారు. యాత్రలో ప్రజలు, రైతులు, కార్మికులు, వివిధ కుల సంఘాలు, అన్ని వర్గాలవారు పాల్గొని తమ బాధలు రాహుల్‌గాంధీకి చెప్పుకుంటున్నారని అన్నారు. భవిష్యత్‌లో భారత్ జోడో యాత్ర క్విట్ ఇండియా ఉద్యమ తరహాలో చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో అవినీతి కంపుకొడుతోందని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులను ప్రజలు చీదరించుకొనే పరిస్థితి నెలకొందన్నారు.
నేడు మేనూర్‌లో భారత్ జోడో గర్జన సభ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్‌లో భారత్ జోడో గర్జన పేరుతో లక్ష మందితో భారీ విజయోత్సవ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ సభకు తరలిరానున్నట్టు చెప్పారు. సమావేశంలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి సుబ్బిరామిరెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎంఎల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ సురేష్‌శెట్కార్ పాల్గొన్నారు.