Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టులతో డబ్బులు.. ధరణితో భూములు
- గుంజుకోవడమే కేసీఆర్ పని
- 'భారత్‌జోడో గర్జన'లో రాహుల్‌గాంధీ
- రైతు రుణమాఫీ చేస్తామని హామీ
- తెలంగాణలో ముగిసిన జోడో యాత్ర
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం ప్రాజెక్టుల రీషెడ్యూల్ పేర డబ్బులు, సాయంత్రం ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూములు గుంజుకుంటు న్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల భూములపై తిరిగి హక్కులు కల్పిస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు విధానాలతో అన్ని వర్గాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఆ భయాన్ని హింస, ద్వేషంగా మార్చి వ్యాపింపచేస్తూ రాజకీయ ప్రయోజనం పొందుతున్నారని విమర్శించారు. ఈ హింస, విద్వేషానికి వ్యతిరేకంగా భారత్‌జోడో యాత్ర చేపట్టినట్టు వివరించారు. తెలంగాణ ప్రజల నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర తెలంగాణలో సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూరు మండలం మేనూరులో 'భారత్ జోడో గర్జన' పేరిట ఆ పార్టీ వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత ప్రజల గొంతునొక్కలేరని, ఎంత అణగదొక్కితే అంతగా పైకి లేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా యాత్రలో ఓ చిన్నారితో ఎదురైన ఉదాహరణ పంచుకున్నారు. తెలంగాణలో విద్య, వైద్యం మొత్తం ప్రయివేటీకరణ చేశారని, ఓ పిల్లాడు డాక్టరో, ఇంజినీరో కావాలంటే లక్షల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర సర్కారు విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలోనే దళితులకు, గిరిజనులకు భూములు ఇచ్చారని, యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన గిరిజన చట్టం రాష్ట్ర సర్కారు అమలు చేయడం లేదని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా రైతుల, దళితుల, గిరిజనుల భూ హక్కులను లాక్కుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఏ రైతూ లాభపడలేదని, తన యాత్రలో ఎదురైన ఏ రైతును కదిలించినా కష్టాలేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణ యువతకు ఉపాధి దక్కడం లేదని, పేదలకు లాభం జరగడం లేదని విమర్శించారు. మరోవైపు నరేంద్రమోడీ, కేసీఆర్ ఇద్దరూ కలిసే పని చేస్తున్నారన్నారు. లోక్‌సభలో ఏ బిల్లు తీసుకొచ్చినా టీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలకు కూడా మద్దతు ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్ ధరణి, ప్రాజెక్టులు అంటే.. మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. మోడీ చర్యలతో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఉపాధి లభించడం లేదని, ఫలితంగా యావత్ దేశంలో భయాందోళన నెలకొందని చెప్పారు. రైతులకు మద్దతు ధర లభించడం లేదని, రుణాలు మాఫీ కావడం లేదని, భయం నెలకొందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా దేశంలో భయోత్పాతం సృష్టిస్తూ హింస, విద్వేషాన్ని రెచ్చడొడుతున్నారని తెలిపారు. ఈ యాత్రతో తెలంగాణ ప్రజల నుంచి ఎంతో నేర్చుకున్నానని, రాష్ట్రంలో చేసిన పాదయాత్రను ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ ఆకాంక్షలతో, ఆశయాలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఈ ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో సిద్ధించాయా అని ప్రశ్నించారు. తెలంగాణలో సాగుతున్న అరాచక, రాచరిక పోకడలను తుదముట్టించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. చక్కెర ఫ్యాక్టరీ, పసుపు బోర్డు అని, జొన్నలకు గిట్టుబాటు ధర అని హామీనిచ్చారని, చివరకు రైతులు పండించిన పంటను కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటను కొనలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే ఎంత? పోతే ఎంత? అని అన్నారు. మోడీ, కేసీఆర్‌ను శంకరగిరిమాన్యాలు పట్టించే బాధ్యత రైతులకు లేదా అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే సప్త సమస్యలకు పరిష్కారం అన్న మేధావులు.. తెలంగాణ సమాజం సర్వనాశనం అవుతుంటే మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భారత్‌జోడో గర్జన సభకు తెలంగాణ కాంగ్రెస్ అగ్రనాయకులందరూ హాజరయ్యారు. మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్, దిగ్విజరుసింగ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, సీఎల్పీ నేత మల్లుభట్టివిక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హన్మంతరావు, ఎమ్మెల్యే సీతక్క, సంపత్‌కుమార్, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగారాం తదితరులు హాజరయ్యారు.