Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటిపై తీసుకున్న చర్యలేంటో చెప్పండి... : ప్రధాని మోడీకి 64 మంది మేధావుల లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతంలో రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలేవి అమలు కాలేదని పలువురు ప్రొఫెసర్లు, మేధావులు, బుద్ధిజీవులు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు రమా మేల్కొటే, గట్టు సత్యనారాయణ, ఎం.చెన్నబసవయ్య, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వి.క్రిష్ణ, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీహెచ్, దినేష్, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, జూపాక సుభద్ర, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, కాకతీయ యూనివర్సిటీ డాక్టర్ టి.శాస్త్రి, రచయిత డాక్టర్ పసునూరి రవీందర్, ఆర్థికవేత్త డి.పాపారావుతోపాటు మొత్తం 64 మంది ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. హామీలను మరోసారి గుర్తు చేయడం వల్ల వాటి అమలు పట్ల తీసుకున్న చర్యలేంటో ప్రకటిస్తారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయినా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, పారిశ్రామిక రాయితీల చెల్లింపు తదితర విభజన హామీలు అమలు కాలేదని తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు. దేశవ్యాప్తంగా 22 సాఫ్ట్ వేర్ పార్కులు, 157 మెడికల్ కళాశాలలు, 16 ఐఐఎం, 87 నవోదయ పాఠశాలలు, 12 ఐసీఆర్, ట్రిపుల్ ఐటీలు మంజూరు చేసిన కేంద్రం... తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాజ్యాంగాన్ని మతోన్మాద రాజ్యాంగంగా మారుస్తున్నారనీ, మీడియా, కేంద్ర దర్యాప్తు సంస్థలు, సైనిక దళాలను తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో రైతు మెడలపై మోటార్లకు మీటర్ల కత్తిని వేలాడదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయంతోపాటు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను దెబ్బతీసి కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు తగ్గినా పెట్రోల్ ధరలను పెంచుతూ పోతుండటంతో నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడి బతుకు దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్య ధోరణి... రైతులను కష్టనష్టాలకు గురి చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రయివేటీకరించి బడుగు, బలహీన వర్గాల భవిష్యత్తును కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలను నెరవేర్చాలనీ, ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని మేధావులు ప్రధానిని డిమాండ్ చేశారు.