Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షౌరవృత్తిదారుల సంఘం డిమాండ్
- అంబానీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ - హన్మకొండ
క్షౌరవృత్తిలోకి రిలయన్స్ సంస్థను నిషేధించాలని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ క్షౌరవృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లాలోని అంబేద్కర్ క్రాస్ రోడ్స్ వద్ద రిలయన్స్ అధిపతి అంబానీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడా కార్పొరేట్ సంస్థలు క్షౌరవృత్తిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని, దాంతో లక్షలాదిమంది సంప్రదాయ వృత్తిదారుల ఉపాధి దెబ్బతిని వీధిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కరోనా విపత్కర పరిస్థితుల్లో క్షౌరవృత్తి తీవ్ర ఇబ్బందులకు గురవడంతో వేలాదిమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని తెలిపారు. ఈక్రమంలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా రిలయన్స్ సంస్థలు వృత్తిలోకి వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు నిషేధించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం జిల్లా కన్వీనర్ జంపాల రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 లక్షల కుటుంబాలు క్షౌరవృత్తిపై ఆధారపడి 70 వేల సెలూన్ షాపులు ఉన్నాయన్నారు. బడా కార్పొరేట్ సంస్థలు ఈ వృత్తిలోకి వస్తే వారంతా ఉపాధి కోల్పోయి ఆకలి చావులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. క్షౌరవృత్తిని కాపాడి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కాడబోయిన లింగయ్య, గొడుగు వెంకట్, కంచర్ల కుమార్, భాను, రమేష్, బాబు, మూర్తి, ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు.