Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక వీటిపైన్నే ఫోకస్
- సీఎం కేసీఆర్ నిర్ణయం
- త్వరలోనే జిల్లాల్లో విస్తృత పర్యటనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతిష్టాత్మకంగా భావించిన మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించటంపై సీఎం కేసీఆర్ సంతృప్తిగా ఉన్నారు. దాదాపు రెండు నెలలపాటు ఆ ఉప ఎన్నిక ప్రహసనం, దాని వ్యూహ, ప్రతివ్యూహాల్లో పూర్తిగా మునిగిన దరిమిలా ఇక నుంచి పరిపాలనపై ఆసారతం దృష్టి సారించాలని ఆయన నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం ఆయన ఇదే రకమైన ఆదేశాలనిచ్చారు. 2023 డిసెంబరులో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఉన్నందున... ఆ ఏడాది మొత్తం అత్యంత జాగ్రత్తగా పని చేయాలంటూ సూచించారు. ఈ క్రమంలో తనతోపాటు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులందరూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయటం ద్వారా వాటిని వీలైనంత ఎక్కవగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ గులాబీ దళపతి ఇటీవల ఆదేశించినట్టు తెలిసింది. సంబంధిత సూచనలు, సలహాలు, మార్గదర్శకాల రూపకల్పన, వాటి అమలు కోసం ప్రతీ రోజూ ఉదయం ఆయన తన నివాసమైన ప్రగతి భవన్లో పలువురు కీలక నేతలతో భేటీ అవుతన్నట్టు సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తోపాటు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును ఈ భేటీలకు విధిగా హాజరు కావాలంటూ సీఎం సూచించటంతో వారిరువురూ క్రమం తప్పక కేసీఆర్ వద్దక వెళుతున్నారని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో దళిత బంధు పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇప్పటి వరకూ ఆ పథకం కింద ఎంపిక చేసిన లబ్దిదారులతోపాటు నియోజకవర్గానికి 500 మందికి అదనంగా దళిత బంధును కేటాయించాలంటూ సీఎం ఉన్నతాధికారులకు సూచించినట్టు సమాచారం. ఇందుకవసరమైన కసరత్తులు కూడా షురూ అయినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్మించిన కలెక్టరేట్లలో కొన్నింటిని సీఎం గతంలో ప్రారంభించిన సంగతి విదితమే. మునుగోడు ఉప ఎన్నికతోపాటు కొన్ని కారణాల వల్ల మరికొన్నింటి ప్రారంభోత్సవాలు వాయిదాపడ్డాయి. అలా మిగిలిన వాటికి ఆయన త్వరలోనే రిబ్బన్ కటింగ్ చేయనున్నారు. దాంతోపాటు తుంగతుర్తి నియోజక వర్గం, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్లగొండ జిల్లాలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా ఆయన సందర్శించి, అక్కడి పనుల పురోగతిపై సమీక్షిస్తారు.
జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో సీఎం భేటీ...
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో సీఎం కేసీఆర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీజే నివాసానికి వెళ్లిన ఆయన పలు అంశాలపై చర్చించారు. ఇటీవల ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత... వివిధ రాష్ట్రాల్లో బీజేపీ చేష్టలను సీఎం, న్యాయమూర్తులకు, కోర్టులకు విన్నవించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలంటూ ఆయన వివిధ రాష్ట్రాల సీజేలను పలు వేదికల ద్వారా అభ్యర్థించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించిన ఆడియోలు, వీడియోలను కూడా వారికి పంపారు. ఈ కోవలోనే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఆయన భేటీ అవటం ప్రాధాన్యతను సంతరించుకుంది.