Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటిదాకా ఎన్నికలపై పూర్తి స్థాయి సమీక్ష జరగలేదు
- కాంగ్రెస్‌ను ఎందుకు విశ్వసించలేదనే దానిపై లోతైన చర్చ
- రాష్ట్రంపై ప్రియాంకగాంధీ దృష్టి సారిస్తున్నారు : ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక ఓటమిని పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసు కుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ చెప్పారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం బాధాకర మని అన్నారు. దీనిపై ఇప్పటికే జైరాంరమేష్, కేసీ వేణుగోపాల్ తదితరులు ఆరా తీశారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయిందనీ, వాటిపై పూర్తి స్థాయి సమీక్ష జరగలేదని చెప్పారు. మునుగోడు ఓటమిని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం... ప్రజలు ఎందుకు విశ్వసించడం లేదో, ఎందుకు ఓట్లు వేయడం లేదో, సభలకు జనం వస్తున్నా...వారంత ఇతర పార్టీలకు ఎందుకు ఓట్లు వేస్తున్నారో తదితర అంశాలపై చర్చించనుందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితులపై ఇప్పటికే ప్రియాంకగాంధీ సమీక్షించారనీ, మరో దఫా సీనియర్లతో చర్చించనున్నట్టు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పీసీసీ చీఫ్, సీఎల్పీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి పని చేశారన్నారు. అయినా కాంగ్రెస్ విజయం సాధించలేదనీ, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేతలపై దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. టీడీపీ బీసీలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించిందనీ, ఈ క్రమంలో కాంగ్రెస్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం పార్టీ పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీకి దూరమైన వర్గాలను దరికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని ఓడించడమో, గెలిపించడమో అనేది ఒక నాయకడి చేతిలో ఉండదనీ, సమిష్టిగా కృషి ఫలితంగానే విజయావకాశాలుంటాయని చెప్పారు. గవర్నర్ తన ఫోన్ ట్యాపరింగ్ అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారంటే, రాష్ట్రంలోని సామాన్యులకు రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. ఖతార్‌కు వలస వెళ్లిన కార్మికులు తిరిగి రాష్ట్రానికి వస్తున్నారనీ, వారికి ఉపాధి, రేషన్‌కార్డులు, డబుల్‌బెడ్‌రూమ్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరుపున ఎన్ఆర్ఐ విధానాన్ని తీసుకరావాలని కోరారు.