Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ సంస్థ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు సీఐటీయూ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసి కార్మికుల పే స్కేల్, ఉద్యోగ భద్రత, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు వారు టీఎస్ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు లేఖ రాశారు. 2019 జులై నుంచి కార్మికులకు బకాయిపడ్డ ఏడు డీఏలలో ఐదింటిని అమలు చేయడం, సమ్మెకాలపు జీతాన్ని చెల్లిస్తూ ఉత్తర్వులివ్వడం, పండుగ అలవెన్స్‌లు ఇప్పించడం లాంటివి మంచి పరిణామాలని పేర్కొన్నారు. అయితే, బకాయిపడ్డ 2017, 2021 వేతన ఒప్పందాలను వెంటనే అమలు చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగ భద్రతపై 2021లో విడుదల చేసిన మార్గదర్శకాలలో మార్పులు చేయాలని సూచించారు. సంస్థలో యూనియన్ల కార్యకలాపాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం అనుసరిస్తున్న తీరుతో సీసీఎస్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నదని వాపోయారు. సీసీఎస్ నిర్వహణలో నష్టం వస్తే దానికి బాధ్యత మేనేజింగ్ కమిటీ వహించాలని కోరారు. సీసీఎస్‌కు రావాల్సిన రూ. 887 కోట్లను (అసలు, వడ్డీ కలిపి), నెలవారీగా చేస్తున్న రికవరీలను సంస్థ జమచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.