Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎఫ్ఆర్టీఈ చైర్పర్సన్ జగ్మోహన్సింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో అందరికీ నాణ్యమైన, సమానమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆలిండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ (ఏఐఎఫ్ఆర్టీఈ) చైర్పర్సన్ ప్రొఫెసర్ జగ్మోహన్సింగ్ విమర్శించారు. మూడురోజులపాటు కొనసాగనున్న ఏఐఎఫ్ఆర్టీఈ జాతీయ సమితి సమావేశాలు శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ చర్చి కాలనీలో ప్రారంభమయ్యాయి. అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ఒక పథకం ప్రకారం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. అన్ని రంగాల్లో జాతీయీకరణ చేయాలని చెప్తూనే విద్యలో విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతిస్తున్నదని అన్నారు. విద్యా ప్రయివేటీకరణను బలోపేతం చేస్తున్నదని చెప్పారు. కొఠారి కమిషన్ ప్రకారం విద్యకు కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులను కేటాయించాలని ఉన్నా ఏనాడూ మూడు శాతానికి మించి కేటాయించడం లేదన్నారు. కోవిడ్ వల్ల బతుకు దుర్భరమైన పేదల పిల్లలు విద్యకు దూరమయ్యారని వివరించారు. ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులు బ్యాంకు రుణాలను రూ.వేల కోట్లు కట్టకుంటే వాటిని ప్రభుత్వాలు మాఫీ చేస్తున్నాయని అన్నారు. కానీ పేదల విద్యకు మాత్రం బడ్జెట్ కేటాయింపులు చేయకుండా నిర్లక్యం చేస్తున్నదని విమర్శించారు. పేదలను విద్యకు దూరం చేసేందుకే నూతన విద్యావిధానం తెచ్చిందనీ, అందులో కామన్ విద్యా విధానం లోపించిందని చెప్పారు. నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ఆర్టీఈ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వికాస్ గుప్త, నాయకులు కె చక్రధర్‌రావు, హరగోపాల్, కె లక్ష్మినారాయణ, మధుప్రసాద్, రమేష్ పట్నాయక్, కాత్యాయని విద్మహే, హరిజిందర్ సింగ్, ప్రసాద్, అశుతోష్ ముఖర్జీ, మల్లిగే, మాధురి, మీరా సంఘమిత్ర, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్ కుమార్, ముత్యాల రవీందర్, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య, ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, పీడీఎస్‌యూ నాయకులు జూపాక శ్రీనివాస్, పరశురాం, విజరు ఖన్నా, అల్లూరి విజరు, రామకృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.