Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్లో సాగుదారులకు హక్కు పత్రాలు : కలెక్టర్లకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో పోడు భూముల సర్వేను పూర్తి చేసి, పట్టాలను సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఎస్ సోమేష్‌కుమార్, కలెక్టర్లు, పోలీసు, అటవీ శాఖల అధికారులతో కలిసి ఆమే శుక్రవారం పోడు భూములపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామసభలను నిర్వహించి తీర్మానం కాపీలను డివిజన్, జిల్లా స్థాయి కమిటీలకు వెంటనే పంపాలన్నారు. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న లబ్దిదారులకు పోడు భూముల పట్టాలను వచ్చే నెల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భావిస్తున్నదని స్పష్టం చేశారు. విజ్ఞాపనల వెరిఫికేషన్, సర్వే లను వెంటనే పూర్తి చేయడానికి అదనపు బందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.14 లక్షల క్లైయిములు అందాయనీ, ఇప్పటికే అధిక శాతం వెరిఫికేషన్ పూర్తయిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగొధ్దని స్పష్టం చేశారు. రెవిన్యూ, అటవీ శాఖ అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో అడవులను సంరక్షించాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. పోడు భూములకు సంబంధించి మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను ఒక టీమ్ వర్క్‌తో పూర్తిచేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సి.ఎస్ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సిసిఎఫ్ దొబ్రీయల్ , గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.