Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్నం 3.20కి రామగుండానికి మోడీ
నవతెలంగాణ-కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చి.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా రామగుండానికి మధ్యాహ్నం 3.20 గంటలకు చేరుకోనున్నారు. ఆర్ఎఫ్సీఎల్ను సందర్శించి అనంతరం అక్కడే గంటపాటు అధికారులతో సమీక్షించనున్నారు. అక్కడి నుంచి ప్రజలనుద్దేశించి సభలో మాట్లాడనున్నారు. సుమారు రెండుగంటల పర్యటన అనంతరం తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇతర జిల్లాల నుంచి ఐదుగురు ఎస్పీలు, మరో ఐదుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, రెండు వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. ప్రధాన మంత్రి భద్రతా సిబ్బంది సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు రామగుండం కమిషనరేట్ సీపీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
మోడీ రాకపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను తుంగలో తొక్కటంతోపాటు తెలంగాణకు అన్ని విధాలా మొండి చేయి చూపిన ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తనున్నాయి. వామపక్షాలు, వాటి అనుంబంధ విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, కర్షక సంఘాలతోపాటు వివిధ ప్రజా సంఘాలు, జేఏసీల ఆధ్వర్యంలో రామగుండంతోపాటు హైదరాబాద్, ఇతర జిల్లాల్లో నిరసనలు చేపడతామని ఆయా సంఘాల నాయకులు తెలిపారు. మోడీ గో బ్యాక్ అనే నినాదాలతోపాటు నల్లబ్యాడ్జీల నిరసన ప్రదర్శనల మధ్య శనివారం ప్రధాని రాష్ట్ర పర్యటన కొనసాగనుంది. మరోవైపు ఆయన రాక నేపథ్యంలో పలు జిల్లాల్లో వామపక్ష, ప్రజా సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేయటాన్ని ఆయా సంఘాలు తీవ్రంగా ఖండించాయి.