Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 59మందికి అస్వస్థత
- ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
- పరిశీలించిన డీఎంఅండ్‌హెచ్‌ఓ
నవతెలంగాణ-నవీపేట్/ నాగిరెడ్డిపేట్
పాఠశాలలకు పంపిణీ చేసే బియ్యం, కూరగాయాల నాణ్యతాలోపంతో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో జాలికట్టిన బియ్యం తిని 42 మంది విద్యార్థులు, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చీనూర్ గ్రామంలోని పాఠశాలలో 17మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో హాస్పటల్లో చికిత్స అందిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో మధ్యాహ్నం బియ్యం అయిపోవడంతో ఎండీఎం కార్మికులు స్థానిక మోడల్ పాఠశాల నుంచి బియ్యం తెప్పించుకొని వంట చేశారు. బియ్యం పంపిణీ చేయడంతో అది తిని 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అది తిన్న అనంతరం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. సమాచారం మేరకు డీఎంఅండ్‌హెచ్‌వో సుదర్శన్ ఘటనా స్థలానికి వచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. కడుపునొప్పి, తలనొప్పితో విద్యార్థులు బాధపడుతుండగా ప్రథమ చికిత్స చేయగా 36 మంది విద్యార్థులు సాధారణ స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆరుగురు మూడు, నాలుగు సార్లు వాంతులు చేసుకోవడంతో మెరుగైన చికిత్స చేస్తున్నామని, విద్యార్థుల పరిస్థితి అదుపులోనే ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అనంతరం డీఎంఅండ్‌హెచ్‌వో పాఠశాలకు వెళ్లి పరిశీలించగా జాలి కట్టిన బియ్యం ఉన్నాయి. అలాగే పది రోజుల నుంచి విద్యార్థులు వాటర్ ట్యాంక్ నీళ్లే తాగుతుండటంతో నీళ్లతో పాటు బియ్యం, వంటకు ఉపయోగించిన సామగ్రిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షల నిమిత్తం తీసుకెళ్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ వీర్‌సింగ్, ప్రధానోపాధ్యాయులు అనురాధ, రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయులు ఉన్నారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చీనూర్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాఠశాలలోని 1వ తరగతి, 5వ తరగతి విద్యార్థులకు డిఫ్తీరియా టీకాలు వేశారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థినీ, విద్యార్థులు మధ్యాహ్నం 3.30 గంటలకు వాంతులు, విరేచనాలు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. దాంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏగొండ, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందజేసి వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శరత్ కుమార్ విద్యార్థులను పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు శరత్‌కుమార్ తెలిపారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మధ్యాహ్న భోజనం బాగోలేకపోవడంతోనే తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు.