Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒప్పందానికి అనుగుణంగా ప్రస్తుత చార్జీలు తగ్గించాలి
- సామాన్య, అసంఘటితరంగ కార్మికులు భరించగలిగే స్థితిలో లేరు
- టిక్కెట్ ధరలు పెంచితే రైడర్‌షిప్ మరింత తగ్గిపోతుంది
- చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వాలు వ్యతిరేకించాలి : సీపీఐ(ఎం)
- లేబర్ సెస్ చెల్లించని ఎల్అండ్టీ సంస్థ
- ఫేర్ ఫీక్సెషన్ కమిటీ చైర్మెన్కి మెయిల్ ద్వారా లేఖ
నవతెలంగాణ-సిటీబ్యూరో
మెట్రో రైలు చార్జీలను పెంచొద్దని, ప్రస్తుత చార్జీలను ఒప్పందానికి అనుగుణంగా తగ్గించాలని ఫేర్ ఫీక్సేషన్ కమిటీ చైర్మెన్‌కు సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ చార్జీల సవరణ కోసం ప్రయాణికుల అభిప్రాయాలు కోరిన నేపథ్యంలో ఫేర్ ఫీక్సెషన్ కమిటీ చైర్మెన్‌కు సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఈ మెయిల్ ద్వారా లేఖ పంపారు. ఈ మేరకు శుక్రవారం గొల్కోండ క్రాస్‌రోడ్డులోని సీపీఐ(ఎం) కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ధశరథ్, ఎం.మహేందర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మెట్రో రైల్ ప్రయాణికుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీలు అధికంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందానికి విరుద్ధంగా కూడా ఉన్నాయని చెప్పారు. ఒప్పందం ప్రకారం కనిష్ట ధర రూ.8, గరిష్టంగా రూ.19గా ఉండాలని.. కానీ 2017 నుంచి కనీస చార్జీ రూ.10, గరిష్ట చార్జి రూ.60 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఒప్పందం ప్రకారం కనీస చార్జీపై ఏటా 5శాతం పెంచుకునే అవకాశం ఉందని, ఒప్పందంతో సంబంధం లేకుండా మెట్రోరైల్ ప్రారంభం నుంచే చార్జీలను దాదాపు 71శాతం అదనంగా ఎల్అండ్టీ సంస్థ వసూలు చేస్తోందన్నారు. ఒప్పందానికి విరుద్ధంగా వసూలు చేస్తున్న ఈ చార్జీలను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత మెట్రో రైల్ చార్జీలను సామాన్య ప్రయాణీకులు, అసంఘటితరంగ కార్మికులు భరించగలిగే స్థితిలో లేరని, మళ్లీ అదనంగా చార్జీలు పెంచే ప్రతిపాదన ఆమోదించొద్దని కోరారు.
2018 నాటికి 17లక్షల రైడర్ షిప్ చేరుతుందని మెట్రోరైల్ ఎండీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పారని, 2024 నాటికి 24లక్షలు దాటుతుందని అంచనా వేశారని శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకూ 4లక్షలు దాటలేదని గుర్తుచేశారు. ఈ సమయంలో చార్జీలు పెంచితే రైడర్ షిప్ మరింత తగ్గిపోతుందన్నారు. మెట్రో ప్రయాణీకుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని, రైళ్ల ఫ్రీక్వెన్సీ.. బోగీల సంఖ్య పెంచాలని కోరారు. ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 267 ఎకరాల భూమిని, కేంద్రం నుంచి రూ.1458 కోట్ల వయాబులిటీ గ్యాప్ ఫండ్ తీసుకుందన్నారు. భూములు, నిధులు తీసుకున్న కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందంలోని చార్జీలను అమలు చేయకుండా కేంద్ర మెట్రో రౖల్ చట్టం పేరుతో అడ్డుగోలుగా చార్జీలు పెంచిందని, మళ్ళీ ఇప్పుడు పెంచాలని ప్రతిపాదిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వాణిజ్యపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించలేదు..
పబ్లిక్ ప్రయివేటు పార్టనర్‌షిఫ్(పీపీపీ) పద్ధతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఈ ప్రాజెక్టును నడపాలని ఒప్పందం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆదాయం టికెట్ ద్వారా 50శాతం, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా 45శాతం, వాణిజ్య ప్రకటనల ద్వారా 5శాతం పొందుతామని మెట్రో అధికారులు ప్రకటిం చారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా 18.5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్న కాంట్రాక్టు సంస్థ ఇప్పటివరకు 1.3 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని మాత్రమే అభివృద్ధి చేసిందని చెప్పారు. వాణిజ్యపరంగా అనుకున్న లక్ష్యాల్లో 10శాతమూ సాధించలేదన్నారు. కానీ, టిక్కెట్ రేట్లు పెంచి లాభం పొందాలని చూడటం సమంజసం కాదన్నారు. మెట్రో రైల్ నిర్మాణానికి రూ.20 వేల కోట్లకుపైగా ఖర్చయిందని, ప్రాజెక్టుకైన ఖర్చులో ఒక శాతం లేబర్ సెస్ చెల్లించాలని గుర్తుచేశారు. కానీ ఎల్అండ్టీ సంస్థ లేబర్ సెస్ చెల్లించకుండా ఎగవేసిందన్నారు. వడ్డీతో కలిపి కనీసం రూ.300 కోట్లు నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కార్మిక శాఖకు సెస్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిం చాలని ఆయన ఫేర్ ఫిక్సేషన్ కమిటీని కోరారు.