Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందల మందికి ఒకే ఉపాధ్యాయుడు
- కాకరవాయిలో రోడ్డెక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు
- సింగిల్ టీచర్ జాబితాలో దేశంలో రాష్ట్రం మూడోస్థానం
- ఖమ్మం జిల్లాలోనే 207 ఏకోపాధ్యాయ పాఠశాలలు
- కుంటుబడుతున్న ప్రాథమిక విద్య..పట్టింపులేని ప్రభుత్వం
యునెస్కో లెక్కల ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలల జాబితాలో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఆరు వేల మందికి పైగా విద్యార్థులకు సింగిల్ టీచర్ బోధిస్తున్నారు. సంబంధిత ఉపాధ్యాయుడు పాఠశాలకు రానిరోజు సెలవు ప్రకటించాల్సి వస్తోంది. దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 1.11లక్షల వరకు ఉండగా.. వాటిలో 89% వరకు గ్రామీణ ప్రాంతానికి చెందినవే.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల లభ్యత పెరిగినా టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి మాధ్యమిక పాఠశాలల్లో ఆశాజనకంగా లేదని యునెస్కో వెల్లడించిన 'నో టీచర్ నో క్లాస్..స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా' పేర్కొంది. ఇదే అంశాన్ని ప్రస్ఫుటిస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామస్తులు శుక్రవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. 110 మంది విద్యార్థులకు ఒకే టీచర్ బోధిస్తున్నారు. దాంతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట రోడ్డుపై విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి ఆందోళన నిర్వహించారు. సింగిల్ టీచర్ విధానాన్ని ఎత్తివేసినా అదే తంతు..గతంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో సింగిల్ టీచర్ విధానా న్ని ఎత్తివేసినా ఇంకా అనేక పాఠశాలలను ఏకో పాధ్యాయునితో నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో అస్సలు విద్యార్థులే లేకున్నా టీచర్‌ను కేటాయిస్తు న్నారు. రేషనలైజేషన్ ప్రకియ ద్వారా దీనిని సరి చేయాల్సి ఉన్నా ఏడేండ్లుగా క్రమబద్ధీకరణ చేయడం లేదు. విద్యార్థుల సంఖ్య 20 మంది కంటే తక్కువ ఉంటే సింగిల్ టీచర్ సరిపోతారనే ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలోనే 207 ప్రాథమిక పాఠశాలలను సింగిల్ టీచర్‌తో నెట్టుకొస్తున్నారు. ఒకవేళ ఆ ఏకోపాధ్యాయు డు సెలవు పెట్టిన సమయంలో పక్క స్కూల్ నుంచి ఉపాధ్యాయుడు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న ప్రతిచోటా పక్క స్కూల్స్‌లోనూ సింగిల్ టీచరే ఉండటంతో ఏదో ఒక స్కూల్‌ను ఆరోజు బంబ్ పెట్టాల్సి వస్తోంది.
ఖమ్మం జిల్లా కాకరవాయి ప్రాథమిక పాఠశాల లో ముగ్గురు టీచర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మెడికల్ లీవ్ తీసుకున్నారు. ఈ గ్రామానికి చుట్టు పక్కల ఐదారు గిరిజన తండాలు ఉన్నాయి. అక్కడి స్కూల్స్‌లో సింగిల్ టీచర్నే ప్రభుత్వం కేటాయిం చింది. దీంతో కాకరవాయి స్కూల్ నుంచి ఓ ఉపా ధ్యాయుడు ఎప్పుడూ ఏదో ఒక పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల 110 మంది విద్యార్థులు న్న కాకరవాయి పాఠశాలను సింగిల్ టీచర్‌తో నడిపిం చాల్సి వస్తోంది. కాకరవాయి పక్కనే ఉన్న సుద్ద వాగుతండా ప్రాథమిక పాఠశాలలో 25 నుంచి 30 మంది విద్యార్థులున్నారు. ఈ స్కూల్‌కు కూడా సింగిల్ టీచర్నే ప్రభుత్వం నియమించింది. ముజా హిద్పురం, మంగళిబండతండా పాఠశాలల్లో నూ ఇదే పరిస్థితి. ఇటీవల ఈ మూడుచోట్ల ఎవరో ఒక టీచర్ సెలవు పెడుతుండటంతో కాకరవాయి స్కూల్ నుంచి టీచర్‌ను పంపుతున్నారు. పైగా సుద్దవాగు తండా ప్రాథమిక పాఠశాల దాదాపు నెల రోజులుగా మూతబడే ఉంటుందని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మెన్ మల్లికార్జున్ తెలిపారు. దాంతో పిల్లలకు కనీసం అక్షరాలు, అంకెలు కూడా రావడం లేదని వాపోయారు.
ముగ్గురు ఉండాల్సిన చోట ఒక్కరే..
జిల్లాలోని ఏన్కూరు మండలం జన్నారం పాఠశాలలో 49 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలకు ముగ్గురు టీచర్లను ప్రభుత్వం కేటా యించింది. కానీ టీచర్ పోస్టుల భర్తీ లేకపోవడంతో ఈ పాఠశాలనూ సింగిల్ టీచర్‌తో నడిపిస్తున్నారు. జిల్లాలో 20 మందికిపైగా విద్యార్థులున్న పాఠశాలలు 50 వరకు ఉన్నాయి. వీటికి ఇద్దరు టీచర్లను కేటా యించాల్సి ఉండగా ఒక్కరితోనే నెట్టుకొస్తు న్నారు. తల్లాడ మండలం గంగదేవిపాడులో అస్సలు ఒక్క టీచర్ కూడా లేరు. ఈ కారణంగా ప్రాథమిక విద్య కుంటుబడుతోందని విద్యార్థులు, తల్లి దండ్రులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చదువు కుంటుబడుతోంది
గుంటి సురేష్- కాకరవాయి
కాకరవాయి ప్రాథమిక పాఠశాలలో మా ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. 110 మంది విద్యార్థులున్న చోట ముగ్గురు టీచర్లను నియమించారు. వారిలో ఒకరు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఇంకొకరు పక్కనున్న తండా స్కూల్‌కు వెళ్లారు. ఒక్కరే ఇంత మంది విద్యార్థులకు చెప్పాల్సి వస్తోంది. విద్యార్థులకు చదువు రావట్లేదు.
ఖాళీలు భర్తీ చేయకపోవడంతోనే...
నాగమల్లేశ్వరరావు- టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు
అనేక పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇద్దరు, ముగ్గురు టీచర్లు ఉండాల్సిన చోట ఒక్క టీచర్‌తో నెట్టుకొస్తున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టకపోవడం, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతోంది.
విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచర్లు
యాదయ్య- ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయిస్తున్నాం. ఇటీవల కాకరవాయిలో పేరెంట్స్ ఆందోళన చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే మరో టీచర్‌ను కేటాయించాం. ఎక్కడా బోధనకు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం.