Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సర్కారుకే 51శాతం వాటా ఉంది
- 49శాతం వాటా ఉన్న మేమెట్టా అమ్ముతాం
- ప్రపంచ దేశాలు ఆలోచించేలా 8ఏండ్ల అభివృద్ధి
- దేశ రైతాంగానికి భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ ఎరువు
- రామగుండంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు
- ఆర్ఎఫ్సీఎల్ జాతికి అంకితం
- మరో మూడు జాతీయ రహదారులకు శంకుస్థాపన
నవతెలంగాణ - కరీంనగర్
ప్రాంతీయ ప్రతినిధి / గోదావరిఖని
'సింగరేణి మైన్స్‌ను అమ్ముతున్నట్టు మాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. సింగరేణిలో 51శాతం రాష్ట్ర సర్కారుదే.. మిగిలిన 49శాతం వాటా ఉన్న కేరద్ర సర్కారు ఎలా అమ్ముతుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి' అంటూ ప్రధాని మోడీ రామగుండం వేదికగా స్పష్టం చేశారు. సింగరేణిని అమ్మాలనే ఆలోచనే తమకు లేదని తెలిపారు. మరోవైపు 8 ఏండ్ల తమ అధికారంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయనీ, రెండేండ్ల కిందటి కరోనా విధ్వంసాన్ని దాటుకుని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనే ఎరువుల ఫ్యాక్టరీ సహా భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే మూడు జాతీయ రహదారుల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ.. కరోనా కష్టాలు దాటుకుని ఈ రెండేండ్లలో కష్టాలన్నీ తీరి.. రానున్న మరో రెండేండ్లలో 30 ఏండ్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాల ఆర్థికవేత్తలకు దేశం మీద నమ్మకం పెరిగిందని, ఈ 8 ఏండ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఆయా దేశాలు ఆలోచనలో పడ్డాయని తెలిపారు. దేశంలో మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను ఆత్మనిర్భర్‌లో భాగంగానే పునరుద్ధరించి తక్కువ ధరకే యూరియాను అందిస్తున్నామని చెప్పారు. రైతులకు రూ.250కి లభించే బస్తా యూరియా తయారీ ఖర్చు రూ.1400కుపైగానే అవుతుందన్నారు. అయినప్పటికీ రాయితీ కింద ఒక్కో బస్తాపై 1200వరకు భరిస్తూ రైతులకు నాణ్యమైన ఎరువును అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో భారత్ యూరియా అనే ఒకటే పేరుతో ఎరువు అందించేందుకు ఆలోచన చేస్తున్నామని వివరించారు. 2016లో ఎఫ్‌సీఐని ఆర్ఎఫ్సీఎల్ పేరుతో పునరుద్ధరించేందుకు శంకుస్థాపన చేస్తే ఇప్పుడు అదే ఫ్యాక్టరీ నుంచి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు యూరియాను అందించగలుతున్నామని చెప్పారు. పదేండ్ల కిందట యూరియా కోసం విదేశాలపై ఆధారపడిన దేశ ప్రజలకు దేశీయంగా సంప్రదాయ పద్ధతిలో గ్యాస్ ఆధారితంగా ఉత్పత్తి అవుతున్న ఎరువును అందిస్తున్నామని తెలిపారు. ఇది కేంద్ర సర్కారు నిజాయితీకి నిదర్శనమని చెప్పారు.
రాష్ట్రంలో రోజుకో రంగు మార్చుతున్న సర్కారు
కేంద్ర సర్కారు అభివృద్ధితో పురోగమనిస్తుంటే.. దేశంలో కొంతమంది విధ్వంసకారులు పుట్టుకొస్తున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో స్వార్థ రాజకీయాలతో కేంద్ర సర్కారును అబాసుపాలు చేసే కుట్ర చేస్తున్నారనీ, వారికి త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. రోజుకో రంగు మార్చుతున్న రాష్ట్ర సర్కారు.. సింగరేణిని ప్రయివేటుపరం చేస్తున్నామంటూ తమపై బురదజల్లుతోందని, తమకు అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. సభలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, భగవత్కుభా, గవర్నర్ తమిళిసై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు సహా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
పేలవంగానే సభకు వచ్చిన జనం..
ప్రధాని సభ అనగానే సుమారు లక్ష మంది జనంతో కిక్కిరిసిపోతుందని అందరూ భావించారు. అందుకు భిన్నంగా కేవలం సుమారు 30వేల మందితోనే సభ పేలవంగా సాగింది. అందుకు కారణాలు లేకపోలేదు. మునుగోడు ఎన్నికల్లో ఓటమి చవి చూసిన బీజేపీ ఒకవేళ ఆ ఎన్నికల్లో గెలిస్తే భారీగానే ప్రధాని రాకకు ఏర్పాట్లు చేసేవారమని ఆ పార్టీ ముఖ్యనేతలు చర్చించు కుంటున్నారు. అయితే, ఉప ఎన్నిక ఓటమి, ముందుగానే ప్రధాని రాక షెడ్యుల్ ఖరారు కావడం, స్థానిక నాయకుల్లో సమన్వయం లేకపోవ డం వంటి కారణాలతో సభకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు తప్ప సామా న్య జనం పెద్దగా లేకపోవడం గమనార్హం. వచ్చిన పార్టీ శ్రేణులు సైతం మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, కరీంనగర్ జిల్లాల నుంచే తప్ప పెద్దపల్లి, రామగుండం నుంచి పెద్దగా కార్యకర్తలు కనిపించలేదు. ఏదేమైనా అనుకున్న సమయానికి ప్రధాని సభను పేలవంగానే ముగించారు.
పోలీసుల తిండికి తిప్పలు
ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 2500 మంది పోలీసు సిబ్బంది సభలో పర్యవేక్షిస్తే.. వారికి తాగునీరు, ఆహార ప్యాకెట్లకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం రెండు గంటలు దాటినా పోలీస్ సిబ్బందికి ఆహార ప్యాకెట్లు అందలేదు. దీంతో ఒక్కసారిగా సిబ్బంది అంతా ఆహార ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. అయినా కొంతమందికి దొరక్క మంచినీళ్లతో గడిపిన పరిస్థితి.
ప్రధాని ప్రసంగం 15నిమిషాలే..
సభలో ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సుమారు 3వేల మంది వరకు ఉంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం తర్వాత నేరుగా ప్రధాని 15నిమిషాల పాటు మాట్లాడి కార్యక్రమాన్ని ముగించారు.
కనీస సౌకర్యలు కరువై.. సభ అట్టర్ ఫ్లాప్
సభకు వచ్చిన జనానికి తాగునీటి సౌకర్యం సక్రమంగా ఏర్పాటు చేయలేదు. మధ్యాహ్న భోజనం సైతం రుచికరంగా లేదంటూ పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు. సభకు వచ్చిన జనానికి మూత్రశాలలు ఏర్పాటు చేయలేదు. తెలంగాణ టూరిజం నుంచి వచ్చిన మొబైల్ టాయిలెట్ మాత్రమే అందుబాటులో ఉండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సభ ఏర్పాట్లలో ఒకరోజు ముందు స్థానిక బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సోమవారం సత్యనారా యణను భాగస్వాములు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్థానిక నేతల సహకారం లేకుండా నిర్వహించిన ప్రధాని సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు.ప్రధాని పాల్గొన్న సభా వేదికపై కేంద్ర మంత్రికిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు మరో కేంద్రమంత్రి తప్ప మిగతా రాష్ట్ర నాయకులు ఎవరూ పాల్గొనలేదు. వేదిక కిందనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ సోయం బాబురావు, రాష్ట్ర నాయకులు వివేక్ సహా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఇతర ముఖ్య నేతలు అందరూ మీడియా గ్యాలరీలోనే కూర్చున్నారు.
నిరుత్సాహంలో బీజేపీ శ్రేణులు
దేశ ప్రధాని అందులోనూ బీజేపీ అగ్ర నేత వస్తున్న సభ ఇంత పేలవంగా సాగడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. తమ ముఖ్య స్థానిక నేతలకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు.
ప్రధాని పర్యటనలో సంజయ్ వ్యతిరేకవర్గం దూరం
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్ అంతా తానే చూసుకున్నట్టుగా వ్యవహరించడంతో ఆయన వ్యతిరేకవర్గం ప్రధాని సభలో కనిపించకపోవడం గమనార్హం. అందులోనూ కరీంనగర్ నుంచి కీలకంగా ఉన్న జాతీయ నాయకులు సైతం లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపించింది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కంటే ఇతర జిల్లాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది పార్టీ శ్రేణులు ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ ఉద్యోగులు చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి వచ్చిన సుమారు 100మంది జనం తప్ప సభ ప్రాంగణం మొత్తం ఖాళీ కుర్చీలతోనే దర్శనమిచ్చింది.