Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని పర్యటనలో నిరసనల వెల్లువ
- ముందస్తుగా నాయకుల అరెస్ట్
- రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సిఎల్) ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని రామగుండం పర్యటనను వ్యతిరేకిస్తూ కార్మిక క్షేత్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. మోడీ పర్యటన సందర్భంగా భద్రత సమస్యలు తలెత్తొద్దని పోలీసులు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులను శుక్రవారం రాత్రి, శనివారం ఉదయాన్నే ప్రధానంగా టీబీజీకెఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, సీఐటీయు జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, ఐఎన్టీయుసీ నాయకులు ధర్మపురి, ఎస్.నర్సింహారెడ్డి, ఐఎఫ్టీయు నాయకులు ఐ.క్రిష్ణ, ఇ.నరేష్, తోకల రమేష్, పౌర హక్కుల సంఘం నాయకులు మాదన కుమారస్వామి, బొడ్డుపెళ్లి రవితోపాటు విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
నవతెలంగాణ - విలేకరులు
ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో ఫ్లెక్సీలు సైతం వెలిచాయి. తెలంగాణకు మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐటీఐఆర్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని, టెక్స్టైల్ పార్కు ఏమైందని, మిషన్ భగీరథకు ఎన్ని నిధులు ఇచ్చారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయిందని, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్‌ప్లాంట్, మెడికల్ కాలేజీలు ఎన్ని ఇచ్చారని, పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని, ఐఐఎం ఏమైందని ప్రశ్నల రూపంలో ఫ్లెక్సీల ద్వారా నిలదీస్తూ వీటిని ఏర్పాటు చేశారు.
నల్లబ్యాడ్జీలతో నిరసన
ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రామగుండం జీరో పాయింట్ వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల జెండాలు, బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో వామపక్ష, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా పార్టీ నాయకులను, పార్టీ ప్రజాసంఘాల నాయకులను శనివారం తెల్లవారుజామున అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం పట్టణంలో ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, మహిళా సంఘాలు కలిసి మోడీ దిష్టిబొమ్మను రోడ్డు మీద లాక్కుంటూ గో బ్యాక్ మోడీ అంటూ నిరసన తెలిపారు. కూసుమంచిలో హైదరాబాద్- ఖమ్మం ప్రధాన రహదారిపై మోడీ దిష్టిబొమ్మతో బైటాయించి నిరసన తెలిపారు. వైరాలో ప్రధాన రహదారిపై మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఆసిఫాబాద్ జిల్లాలో సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఎం(ఎంఎల్) నాయకులను తెల్లవారుజామునే అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మోడీ రాకను నిరసిస్తూ ప్లకార్డ్స్‌తో 'వేర్ ఈజ్ మై జాబ్ గో బ్యాక్ మోడీ' అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాలలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతోపాటు టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మందమర్రి ఏరియాలోని కాసిపేట, కాసిపేట 2 గనిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి విధులకు హాజరయ్యారు. దండేపల్లిలో పోలీసులు పీడీఎస్‌యూ, సీపీఐ నాయకులను శనివారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ తరలించారు. ఆదిలాబాద్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, నాయకులు లంక రాఘవులు, బండి దత్తాత్రిను ముందస్తుగా అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మోడీ పర్యటను నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగురవేశారు. నిర్మల్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గాంధీ పార్క్‌లో గాంధీ విగ్రహం ముందు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. భైంసాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాభారతి ఓకేషనల్ జూనియర్ కళాశాలలో నిరసన చేపట్టారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. వనపర్తి పట్టణంలోని ఆర్టీసీ డిపో పెట్రోల్ బంకు దగ్గర నిరసన తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సెంటర్లో జెండాలు పట్టుకొని నల్ల బ్యాడ్జీలు ధరించి మోడీ గో బ్యాక్ అంటూ ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వామపక్షాల నేతృత్వంలో పెద్దఎత్తున కార్మికులు రోడ్డెక్కి.. లేబర్ కోడ్‌తో తమ హక్కులను కాలరాస్తున్న మోడీ రాష్ట్రంలో అడుగు పెట్టొదని నినాదాలు చేశారు. జిల్లా అన్ని పరిశ్రమల వద్ద కార్మికులు నిరసన తెలిపారు. కాటేదాన్, కొత్తురు, మియాపూర్ ప్రాంతంలో కార్మికులు, నాయకుల నిరసనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఓయూలో విద్యార్థుల అరెస్ట్
మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఓయూలో పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. అయితే వారిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తెల్లవారుజామున నుంచే వసతి గృహాల్లో విద్యార్థులను అరెస్టు చేయడం మొదలు పెట్టారు. ఓయూ విద్యార్థి నాయకులు రవి నాయక్‌ను అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట నల్ల జెండాలు ఎగురవేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
సంతోష్‌నగర్‌లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్ పాల్గొన్నారు. సంతోష్ నగర్ ఎక్స్ రోడ్స్ వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు చేశారు. ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ కేవీ, సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మెదక్ సంగారెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, ములుగు, పటాన్చెరువు తదితర పట్టణాల్లో వామపక్షాలు, టీఆర్ఎస్, అనుబంధ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సంగారెడ్డిలో నినాదాలు చేస్తూ పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. సిద్దిపేటలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మెదక్ పట్టణంలో నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులు ప్రదర్శించి మోడీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణకు మోడీ వచ్చే నైతిక హక్కులేదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
దేశ సంపదను పెట్టుబడిదారులకు అమ్మేస్తూ ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి ఏమీ చేయని మోడీ రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల జూలకంటి రంగారెడ్డి అన్నారు. మోడీ రాకను నిరసిస్తూ సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. మోడీ.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా.. రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రామగుండానికి మోడీ రావడాన్ని తీవ్రంగా ఖండించారు. చండూరు మండలకేంద్రంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు.
దామరచర్ల మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తిరుమలగిరిసాగర్ మండలంలో శుక్రవారం రాత్రి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్రా శంకర్‌నాయక్‌ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మిర్యాలగూడ పట్టణంలో ఎస్ఎఫ్ఐ, టీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించారు. భువనగిరి జిల్లాకేంద్రంలో సీపీఐ( ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండును అరెస్టు చేశారు. చౌటుప్పల్, వలిగొండలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. నిజామాబాద్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ను హౌస్ అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని జవహార్‌నగర్ కార్పొరేషన్లో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎన్ బాలమల్లేష్ ఆధ్వర్యంలో మోడీ గో బ్యాక్ అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో సీపీఐ నాయకులకు పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని చింతలగుంట చౌరస్తాలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నల్ల జెండాలతో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.