Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సర్కారు అంధవిశ్వాసాలను దూరం చేయాలి
- తెలంగాణలో వికసించేది కమలమే : బేగంపేట సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేదలను దోచుకునేటోళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తెలంగాణలో అంధవిశ్వాసాలతో పాలన నడుస్తున్నదనీ, చివరకు మంత్రులను చేర్చుకోవడం, తొలగించడం కూడా మూఢవిశ్వాసాల ఆధారంగానే జరుగుతున్నదని విమర్శించారు. అంధవిశ్వాసాలను దూరం చేసేందుకు ప్రజలు కలిసి రావాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు బయట నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు వెనుకబడ్డారనీ, ఒక్క కుటుంబం మాత్రం బాగుపడిందని విమర్శించారు. మునుగోడు ప్రజలు తమకు భరోసానిచ్చారనీ, చీకట్లు కమ్ముకున్న తెలంగాణలో కమలం వికసించడం ఖాయమని చెప్పారు. 1984లో తమ పార్టీకి రెండు లోక్ సభ స్థానాలు మాత్రమే ఉండేవనీ, అందులో ఒకటి తెలంగాణ నుంచేనని గుర్తుచేశారు. అవినీతి, కుటుంబ పాలన వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలంగాణ, దేశ ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారన్నారు. అవినీతిని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని చెప్పారు. మధ్యవర్తుల చేతుల్లోకి డబ్బులు పోవద్దని నేరుగా పథకాల లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహిస్తున్నామనీ, అవినీతిని అంతమొందించేందుకు ఇది ఒక మార్గమని చెప్పారు. ఎవ్వరు తిట్టినా నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రోజూ కిలోలకొద్ది తిట్లను తింటాననీ, అవి తనకు న్యూట్రిషన్‌గా పనిచేస్తున్నాయని చెప్పారు. తిట్టుకుంటూ కూర్చుంటే అభివృద్ధి సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. బీజేపీని తిట్టినా ఊరుకుంటామనీ, ప్రజలను మాత్రం ఏమైనా అంటే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణలో 2 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ అందుతున్నదనీ, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. పీఎం ఆవాస్‌యోజన కింద దేశవ్యాప్తంగా ఇండ్లులేని వారికి అందిస్తున్నామనీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దాన్ని అడ్డుకుంటున్నదని విమర్శించారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనకు విముక్తి కలిగిస్తామన్నారు. ప్రధాని మోడీని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ సత్కరించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మోడీకి చిత్రపటాన్ని అందజేశారు. సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి, గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, నల్లు ఇంద్రసేనా రెడ్డి, మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీలు రామచంద్రారావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.