Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వారికోసం ప్రత్యేకంగా 'ఎంప్లాయీ ఎంగేజ్మెంట్' మొబైల్ యాప్‌ను రూపొందించినట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీలోని పలు సేవల్ని డిజిటలైజ్ చేస్తున్నామనీ, దానిలో భాగంగా ఉద్యోగుల కోసం ప్రత్యేక యాప్‌ను వినియోగంలోకి తెస్తున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత ఈ యాప్‌ను కంటోన్మెంట్, బర్కత్‌పురా, హైదరాబాద్-2 డిపోల్లో పరీక్షిస్తున్నామని తెలిపారు. శనివారం బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ యాప్‌ను ప్రారంభించారు. సంస్థ లోని 44,764 ఉద్యోగులను కవర్ చేసేలా డిజిటల్ ప్లాట్ఫారంను రూపొందించామన్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం ఉద్యోగులకు విధి నిర్వహణను మరింత సౌకర్యవంతం చేయడమేననీ, స్మార్ట్‌ఫోన్ ఉన్న ఉద్యోగులంతా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చన్నారు. రోజువారీ హాజరు, సెలవులు, పే స్లిప్‌లు, స్వంత సమాచారం, ఒకేసారి ఎక్కువ మంది ఉద్యోగులతో మీటింగ్స్, సర్క్యులర్లు, నోటిఫికేషన్లు, ట్రాకింగ్, ప్రభుత్వ నివేదికలన్నింటినీ ఒకేచోట అందుబాటులో ఉండేలా ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని స్పష్టం చేశారు. ఉద్యోగుల నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తదుపరి వెర్షన్లలో మరిన్ని ఫీచర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణీకుల సమస్యలు, అనుభవాలను నేరుగా తెలుసుకునే విధంగా 'ప్రజల వద్దకు ఆర్టీసీ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.