Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉచిత చక్కెర వ్యాధి స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తున్నట్టు తల్లి, పిల్లల ఆరోగ్య కన్సల్టెంట్ డాక్టర్ టి.నళిని తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మధుమేహం దీర్ఘకాలికమైన వ్యాధి అని, రక్తంలోని గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుందని తెలిపారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా డయాబెటిక్ రోగుల సంఖ్య ఏడు కోట్లకు చేరుకుంటుందనీ, ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో 15 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. అధిక బరువు, ఊబకాయం, హైబీపీ, ప్రెగెన్సీలో షుగర్, కుటుంబ చరిత్ర, వ్యాయామం లేకపోవడం, కొవ్వు శాతం పెరగటం ఈ వ్యాధికి దారి తీస్తాయని చెప్పారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోయినా, చికిత్స అందించకపోయినా గుండె జబ్బులు, కంటి చూపు మందగించటం, పక్షపాతం, మూత్రపిండాలు దెబ్బతినటం, నరాల బలహీనత తదితర జటిలమైన సమస్యలు ఏర్పడతాయన్నారు. ప్రజలు వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నళిని సూచించారు.