Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియార్టీ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలి : సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు కార్మికుల వేతనాల కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 306 (ముసాయిదా)ను సవరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచాలనీ, వారి సీనియార్టీ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో సుమారు 1,350 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలో గత 25 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. వారికి నెలకు రూ.14,700ల జీతం ఇస్తున్నారని పేర్కొ న్నారు. ఈపీఎఫ్ మినహాయించగా వారి చేతికి రూ.12,900 వస్తా యని వివరించారు. ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, క్లినికల్స్, డిస్పెన్స రీల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం జీవోనెంబర్ 306 (ముసాయిదా)ను కార్మిక శాఖ కమిషనర్ 2018, జులై నాలుగున విడుదల చేశారని తెలిపారు. దాని ప్రకారం వారికి రూ.19 వేల నుంచి రూ.20వేల వరకు జీతం పెరిగే అవకాశమున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ గెజిట్ చేయలేదని పేర్కొన్నారు. అదే విధంగా సుమారు 25 ఏండ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులకు మూడు, నాలుగేండ్ల నుంచి సర్వీసులో ఉన్న కార్మికులకు ఒకే విధమైన (రూ.14,700లు) జీతం ఇవ్వడం సరైందికాదని తెలిపారు. కాబట్టి సీనియార్టీని బట్టి జూనియర్లకు రూ.20 వేలు తగ్గకుండా, సీనియర్లకు వారి సీనియార్టీని బట్టి జీతం పెంచేలా ఈ ముసాయిదా జీవోను సవరించి, అమలు చేయాలని కోరారు. తెలంగాణ సాధించిన వెంటనే నిమ్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామంటూ కేసీఆర్ హామీఇచ్చారని గుర్తు చేశారు. మంత్రులు కూడా నిమ్స్ ఆవరణలో సభపెట్టి కార్మికులకు న్యాయం చేస్తామంటూ వాగ్దానం చేశారని పేర్కొన్నారు. కార్మికులు ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకుని న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.