Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా, బోధనాస్పత్రుల్లో సౌకర్యాల కల్పన
- అవయవదాతల సంఖ్య పెంచే యోచన
- రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కసరత్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎవరికైనా రోగమొస్తే డాక్టర్లు ముందుగా మందులతో నయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రోగం ముదిరితే సంబంధిత అవయవానికి శస్త్రచికిత్స చేస్తారు. సదరు అవయవం పూర్తిగా పాడై పోతే అవయవమార్పిడి చేయించుకోవాలని వారు సూచిస్తుండటం పరిపాటి. ఆధునిక వైద్య పరిశోదనల కారణంగా వచ్చిన ఫలాలివి. ఈ ఫలితాన్ని బాధితులకు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జీవన్‌దాన్ అనే విభాగాన్ని స్థాపించింది. తద్వారా అవయవదాతల నుంచి వాటిని సేకరించి రోగులకు అమర్చడం ద్వారా ప్రాణాలను నిలుపుతున్నారు. ముఖ్యంగా జీవన్మృతులు (బ్రెయిన్ డెడ్) అయిన వారి నుంచి సేకరించిన గుండె, మూత్రపిండాలు తదితర అవయవాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి ప్రాణం పోస్తున్నాయి. అయితే అవయవ స్వీకర్తల కన్నా అవయవదాతల సంఖ్య మరీ తక్కువగా ఉంటుండంతో ఇప్పటికీ బాధితులు ఏండ్ల తరబడి వాటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. డిమాండ్‌కు తగినట్టు అవయవాల సేకరణ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల డాక్టర్లకు కూడా అవగాహన కల్పించి, ఆయా ఆస్పత్రుల్లోనూ అవయవ మార్పిడికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంకల్పించింది.
జీవన్ దాన్లో అవయవాల కోసం పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఆ మేరకు అవయవదాతల సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఇప్పటి వరకు మూత్రపిండాల కోసం 5,628 మంది నమోదు చేసుకోగా 1705 కిడ్నీలను మాత్రమే సేకరించగలిగారు. అదే విధంగా కాలేయం కోసం 5,111మంది ఎదురు చూస్తుండగా 1,049 కాలేయాలను దాతల నుంచి పొందగలిగారు. ఈ నేపథ్యంలో అవయవదాతలు, స్వీకర్తల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాస్పత్రులను కూడా క్రియాశీలకంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటి వరకు ఎక్కువగా కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రుల నుంచి, అందులోనూ హైదరాబాద్ నుంచే అవయవాలు వస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల డాక్టర్లకు శిక్షణ లేకపోవడం, జిల్లా ఆస్పత్రుల స్థాయిలో బ్రెయిన్ నిర్దారణ చేసేందుకు న్యూరో ఫిజిషియన్, అనేస్థియషిస్ట్ తదితర డాక్టర్లతో కూడిన వైద్య బందం లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు ముందుగా ఆయా ఆస్పత్రుల డాక్టర్లు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, బ్రెయిన్ డెడ్ నిర్దారణకు సమీపంలోని మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుల సేవలను అనుసంధానించడం, అవయవ సేకరణ,మార్పిడికి అవసరమైన సౌకర్యాలను దశల వారీగా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా స్థాయిలో పని చేసే డాక్టర్లు మొదలు కొని బోధనాస్పత్రుల వరకు అందరికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని డీఎంఈని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అవయవసేకరణ, మార్పిడిపై పెద్ద ఎత్తున శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.