Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ ప్రయివేటీకరణపై ప్రధాని నరేంద్రమోడీ చెప్పినవన్నీ అబద్ధాలే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆయన పార్లమెంటులో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని కోల్ బ్లాకులను తమకే ఇవ్వాలని సింగరేణి సంస్థ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం నిర్థ్వధంగా తిరస్కరించిన మాట వాస్తవం కాదా...అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి హౌదాలో ఉండి ఇంతటి పచ్చి అబద్ధాలు ఆడటం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్ 13న నిండు పార్లమెంటు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరపున కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని కోల్ బ్లాకులను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నామని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. అయితే తెలంగాణలోని కోల్ బ్లాకులను తమకే అప్పగించాలని సింగరేణి సంస్థ చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారని స్పష్టం చేశారు. ఇప్పుడు మోడీ దీనికి భిన్నంగా రామగుండం సభలో మాట్లాడారని చెప్పారు. ఏది నిజమో ఆయనే తేల్చాలన్నారు.
సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలు ఉండాలి
సామాజిక స్థితిగతులకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలు ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ''ఎమర్జింగ్ చాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్'' అనే అంశంపై జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాఠ్య ప్రణాళికల్లో సమకాలీన పరిస్థితులు ఉండాలనీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా రూపకల్పన జరగాలని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలపై అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేక దష్టి పెట్టాలనీ, ప్రభుత్వాలు కూడా వాటిని ప్రోత్సహించాలని చెప్పారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ యాదవ్, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతా గణేష్ పాల్గొన్నారు.