Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు, అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రాజెక్ట్ అధికారులు, డీఎఫ్ఓలు, డీటీడీవోలతో అటవీ హక్కుల చట్టంపై కన్వర్జెన్స్ వర్క్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోడు సర్వేలో తలెత్తిన సమస్యలు వాటి పరిష్కారానికి మార్గాలపై అధికారుల సలహాలు సూచనలు తీసుకుని దిశ నిర్ధేశం చేశారు. అటవీ హక్కుల చట్టం- 2005 నియమనిబంధనల ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి శాశ్వతం పరిష్కారం దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదన్నారు. పోడు వ్యవసాయదారులకు న్యాయం చేసేందుకు అడవులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసిందనీ, అటవీ హక్కుల చట్టం- 2005 పరిధికి లోబడి పోడు వ్యవసాయ దారులకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్ఓఎఫ్ఆర్.2005 చట్టం,గ్రామ కమిటీలు హ్యాబిటేషన్ వారీగా, డివిజన్ వారీగా, జిల్లా కమిటీలు ఏర్పాటు, కమిటీల బాధ్యతలు గురించి మంత్రి అధికారులకు వివరించారు. పోడు పేరుతో ఇకముందు అడవుల నరికివేతకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయనీ, అవసరమైతే ప్రత్యేక చట్టాలు అమలు చేసి అడవుల పరిరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. నరికివేత వలన వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. రాష్ట్రం లో 24 శాతం అటవీ విస్తీర్ణం ఉందని తెలిపారు..ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. సర్వేలో అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పారదర్శకంగా తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పర్గీన్ పీసీసీిఎఫ్ పీవోలు అటవీ అధికారులు పాల్గొన్నారు.