Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్హెచ్ఏఐ ఆర్వోకు ఫెడరేషన్ వినతి
- కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా : కృష్ణప్రసాద్ హామీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని జాతీయ రహాదారులపై ఉన్న టోల్గేట్ల దగ్గర జర్నలిస్టుల నుంచి వసూలు చేస్తున్న చార్జీలను రద్దుచేస్తూ ఫాస్టాగ్ మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని జాతీయ రహాదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ప్రాంతీయ అధికారి ఎ. కృష్ణప్రసాద్‌కు ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం వినతిపత్రం సమర్పించింది. టోల్గేట్ల దగ్గర జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను దాదాపు గంటపాటు ఆర్వోతో చర్చించింది. సమాజం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న జర్నలిస్టుల నుంచి టోల్ ఫీజులను వసూలు చేయడం న్యాయం కాదని ఫెడరేషన్ అభిప్రాయపడింది. కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా జర్నలిస్టులు చితికిపోయారనీ, మానసీక, అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఎన్హెచ్ఏఐ ఆర్వో దృష్టికి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది జర్నలిస్టులు ఉన్నారనీ, వారందరికి టోల్గేట్ల దగ్గర ఫాస్టాగ్ మినహాయింపు ఇవ్వాలని కోరారు. టోల్ ఫీజు వసూళ్ల మూలంగా ఆర్టీసీ రాయితీ సైతం తగ్గి బస్సుఛార్జీలు సైతం అధికంగా చెల్లించాల్సి వస్తున్నదని గుర్తు చేశారు. దీంతో ఆర్థికభారం మరింత అధికంగా పడుతున్నదని అభిప్రాయపడ్డారు. ఇందుకు స్పందించిన ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఫాస్టాగ్ మినహాయింపు ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాననీ, కేంద్ర ప్రభుత్వ ఉపరితలరవాణా శాఖ దృష్టికి సైతం తీసుకుపోతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాంచందర్, గుడిగ రఘు, కార్యదర్శి బి. రాజశేఖర్, హెచ్‌యూజే అధ్యక్షులు బి. అరుణ్‌కుమార్, కార్యదర్శి బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.