Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం పదైనా వణికిస్తున్న చలి
- మధ్యాహ్నం పూట కూడా చల్లని గాలులు
- కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 5.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
- వేగంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
- వచ్చే మూడ్రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హుహు..హుహు..అనేలా చలి వణుకుడు పుట్టిస్తున్నది. డిసెంబర్ మొదటి వారంలోనే ఐదారు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం శుక్రవారం కామారెడ్డి జిల్లా డోంగ్లీలో కేవలం 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. కామారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, మెదక్, కుమ్రంభీమ్ అసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే నమోదయ్యాయి. మొత్తంగా 15 జిల్లాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఉదయం 10 గంటలు దాటినా చలి భయానికి ఇంటి తలుపులు తీయని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం పూట కూడా చల్లని గాలులు వీస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం మీదుగా తూర్పు దిశ నుంచి చల్లని గాలులు వీస్తున్నాయనీ, దీంతో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లోనూ ఉదయం బాగా పొగమంచు కమ్ముకుంటున్నది. నగర శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే మూడురోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.