Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్గా ఎలా మార్చుతారు
- అభ్యంతరాలకు ఎన్నికల సంఘం సమయమివ్వలేదు
- ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం టీఆర్ఎస్ను రద్దు చేయాల్సిందే...
- టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ (2017)లో బంగారు కూలీల పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వ్యాపారస్తుల నుంచి కోట్ల రూపాయలు బహిరంగంగా వసూలు చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయనీ, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. బంగారు కూలీ పేరుతో వందల కోట్లు వసూలు చేసిన గులాబీ పార్టీ ఎక్కడా లెక్కలు చూపించలేదని తెలిపారు. దానిపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. ఢిల్లీ హైకోర్టులో తాను కేసు వేశాననీ, తమ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు బంగారు కూలీల వ్యవహారంలో టీఆర్ఎస్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించిందని గుర్తు చేశారు. ఎటువంటి చర్యలు తీసుకోకుండా టీఆర్ఎస్ పేరును మార్చడానికి వీలులేదని తెలిపారు. ఈ వ్యవహరంలో ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించడం లేదంటూ, తక్షణమే ఈ ప్రక్రియపై స్టే ఇవ్వాలంటూ తాను డిసెంబరు 6న ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. డిసెంబర్ 7న ఆ పార్టీకి నోటీసు జారీ చేసిందనీ, సోమవారం విచారణకు వస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆగమేఘాల మీద ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరు మారుస్తూ లేఖ పంపిందని విమర్శించారు. దీనిపై పీఎం, ఆర్థికమంత్రి, హోంమంత్రి, ఈడీ, సీబీఐ తదితర సంస్థలకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఆదాయ పన్నుల శాఖ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్పై బీజేపీ చర్యలు తీసుకోవాలనుకుంటే, కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమిషన్.. టీఆర్ఎస్కు సహకరించిందన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారడం వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పారు. దక్షిణ భారతదేశంలో బీఆర్ఎస్ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిన్నదని చెప్పారు. మోడీని చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్ గుజరాత్‌లతో కేజ్రీవాల్‌తో కలిసి మోడీ వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేయలేదని నిలదీశారు.
ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన సోనియాకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్త శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసిన 1065 మందిని ఆయన అభినందించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిలో ఇప్పటివరకు 609 మంది కార్యకర్తలు మరణించారు. అందులో 100 మంది కుటుంబ సభ్యులకు రూ.2లక్షల రాజీవ్‌గాంధీ బీమా చెక్కులను రేవంత్ పంపిణీ చేశారు.