Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి
- నివాళులర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- సంతాపం ప్రకటించిన పార్టీ ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు
నవతెలంగాణ-ఇల్లందు
నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ఆదర్శవాది దేవులపల్లి యాకయ్య అని, వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన పార్టీ సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య భౌతికాయాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా, మండల నాయకత్వం, సీపీఐ, న్యూ డెమోక్రసీ, ప్రజాపంథా, టీఆర్ఎస్, టీడీపీ, న్యూ డెమోక్రసీ పార్టీలతో పాటు సామాజిక, ప్రజాసంఘాల నాయకులు సందర్శించి సంతాపం తెలియజేశారు. అనంతరం జరిగిన సంతాప సభలో తమ్మినేని మాట్లాడుతూ.. మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలో యాకయ్యను చూసి నేర్చుకోవచ్చని, తాను ఒక్కడే కాకుండా కుటుంబం మొత్తాన్ని సీపీఐ(ఎం)లో నిలబడేలా చేశారన్నారు. ఇల్లందు నియోజకవర్గం, జిల్లాలో పార్టీ అవసరాల నిమిత్తం ఎక్కడికి పంపినా వెళ్లి బాధ్యతలు నిర్వహించారని, పార్టీ విస్తరణలో, పార్టీ నిర్మించడంలో చివరి శ్వాస వరకు కృషి చేశారని తెలిపారు. ఇల్లందు మున్సిపాలిటీలో మూడు పర్యా రరయాలు వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచారని, కష్ట సమయాల్లో పార్టీని అంటిపెట్టుకొని ఎన్ని అవరోధాలు వచ్చినా జంకకుండా పార్టీ పిలుపుని అమలు చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కార్మిక రంగంలోనూ, వ్యవసాయకూలీల సమస్యల పైన, అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించాడని, పార్టీ పట్టణ, డివిజన్ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు. కాగా, యాకయ్య మృతికి సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో సంతాపం తెలిపి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. యాకయ్యకు భార్య సోమలక్ష్మి, కుమార్తె సంధ్య ఉన్నారు. సంతాప సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, పాలడుగు భాస్కర్, నాయకులు పి.రాజారావు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, పి.సోమయ్య, సాదుల శ్రీనివాస్, మండల కార్యదర్శి అబ్దుల్ నబీ, ప్రజాపంథా నాయకులు గుమ్మడి నరసయ్య, సీపీఐ రాష్ట్ర నాయకులు కే.సారయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు ఆవునూరి మధు, టీడీపీ నాయకులు ముద్రగడ వంశీ, టీబీజీకేఎస్ నాయకులు రంగనాథ్, యాకూబ్ షావలి, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆయన లేని లోటు తీరనిది : సీఐటీయూ సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ, సీపీఐ(ఎం) నాయకులు దేవులపల్లి యాకయ్య మరణం పట్ల సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీనియర్ నాయకులు, ఉపాధ్యక్షులు పి. రాజారావు, కోశాధికారి వంగూరు రాములు, కార్యదర్శి బి. మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్ శుక్రవారం ఇల్లందులోని యాకయ్య నివాసం వద్ద ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేవులపల్లి యాకయ్య 1975లో ప్రజా ఉద్యమంలోకి వచ్చారనీ, 47 ఏండ్లుగా సీఐటీయూ, సీపీఐ(ఎం)లో కీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఇల్లందు, పోలంపల్లిలో సింగరేణి వర్కర్‌గా ఉన్నప్పుడు సింగరేణి యాజమాన్యం డిస్మిస్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రాజారావు నాయకత్వంలో సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్తగా, ఆ పార్టీ ఇల్లందు టౌన్ కార్యదర్శిగా పనిచేశారని గుర్తుచేశారు. ఆయన సీపీఐ(ఎం) నుంచి మూడుసార్లు కౌన్సిలర్‌గా గెలుపొందారని తెలిపారు. వ్యవసాయ కార్మిక, యువజన ఉద్య మాల్లోనూ ముందుండి పోరాడారని కొనియాడారు. అనేకమంది కార్యకర్తలను తయారు చేశారని తెలిపారు. యాకయ్య మరణం సీఐటీయూకి, సీపీఐ(ఎం)కి తీరని లోటు అని పేర్కొన్నారు.